ఎన్టీఆర్ - చంద్ర‌బాబు ఫైట్ రిపీట్ అయ్యింది     2017-01-02   07:11:39  IST  Bhanu C

అవును! ఎన్టీఆర్‌-చంద్ర‌బాబుల ఫైట్ రిపీట్ అయింది! కాక‌పోతే.. అప్పుడు ఏపీ.. ఇప్పుడు యూపీ అంతేతేడా!! అప్ప‌ట్లో ల‌క్ష్మీపార్వ‌తి.. టీడీపీ చీల‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డితే.. ఇప్పుడు కూడా అదే రీజ‌న్ అక్క‌డ కూడా! సాధ‌నా గుప్త రూపంలో ప‌రోక్షంగా పార్టీలో పెద్ద చిచ్చుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్లిపోతే.. యూపీలో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన ఎస్పీ.. 2012లో అధికారంలోకి వ‌చ్చింది. పార్టీని అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంలో ఎస్పీ అధినేత ములాయం ఆయ‌న సోద‌రులు శివ‌పాల్‌, రాంగోపాల్ యాద‌వ్‌లు, కుమారుడు అఖిలేష్ యాద‌వ్‌లు ముఖ్యులు.

ఈ క్ర‌మంలో తాను పార్ల‌మెంటుకు ప‌రిమిత‌మై.. ప్ర‌ధాని పీఠాన్ని కొట్టేద్దామ‌ని ప్లాన్ చేసిన ములాయం.. కుమారుడు అఖిలేష్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టారు. తొలిమూడేళ్లు స‌జావుగానే సాగిన పాల‌న ఆ త‌ర్వాత ఎస్పీలో ఆధిప‌త్య ధోర‌ణి దిశ‌గా అడుగులు వేసింది. మ‌రీ ముఖ్యంగా పాల‌న‌పై ప‌ట్టు పెంచుకున్న అఖిలేష్‌.. పార్టీలోనూ త‌న‌కు తిరుగులేకుండా చేసుకునేందుకు య‌త్నించారు. ముఖ్యంగా త‌న పిన్ని సాధ‌నా గుప్తా.. ఆధిప‌త్యాన్ని, బాబాయి శివ‌పాల్ ఆధిప‌త్యాల‌కు తెర‌దించాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. అయితే, అదేస‌మ‌యంలోత‌న తండ్రికి ఎన‌లేని గౌర‌వం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అవినీతి ఆరోప‌ణ‌ల‌తో శివ‌పాల్ యాద‌వ్‌ను హుటాహుటిన మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు.

అయితే, ఆ మ‌ధ్య జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బాబాయి, అబ్బాయిల మ‌ధ్య వివాదం స‌ద్దు మ‌ణిగింది. అయితే, మ‌ళ్లీ మ‌రో నెల రోజుల్లోనే ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌వుతున్న వేళ.. ఎస్పీలో ముస‌లం పుట్టింది. యూపీలోని కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ములాయం చిన్న‌కోడ‌లు ఉత్సాహ ప‌డ‌డం, అయితే, దీనికి ఆమె పేరును అఖిలేష్ ప‌రిశీలించ క‌పోవ‌డం వివాదానికి బీజం వేసింది. ఈ నేప‌థ్యంలో తండ్రీ కొడుకుల మ‌ధ్య యుద్ధం తీవ్ర‌స్థాయికి చేరింది. పార్టీ నుంచి బ‌హిష్క‌రించే వ‌ర‌కు వెళ్లింది.

ఇక‌, అఖిలేష్ కూడా తెగ‌తెంపులు చేసుకునేందుకు మొగ్గు చూపారు. అయితే, ఎస్పీపై త‌న‌దే ఆధిప‌త్య‌మ‌ని, త‌న తండ్రిని కొంద‌రు(బాబాయి శివ‌పాల్‌, సాధ‌నా గుప్తా) ప్ర‌భావితం చేస్తున్నార‌ని ఆరోపిస్తూ.. త‌న‌కు నేతాజీ అంటే గౌర‌వ‌ముంద‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఈ క్ర‌మంలో పార్టీలో రెండు వ‌ర్గాలు మొద‌ల‌య్యాయి. అఖిలేష్ వ‌ర్గం, నేతాజీ వ‌ర్గం చెరో దిక్కూ చేరిపోయాయి. అఖిలేష్ వ‌ర్గం.. భారీ ఎత్తున ఆదివారం నిర్వ‌హించిన స‌భ ఇప్పుడు మ‌రింత ర‌చ్చ‌కు దారితీసింది. తాము త‌మ నేత‌గా అఖిలేష్‌ను భావిస్తున్నామ‌ని ఎస్పీకి చెందిన అధికార ఎమ్మెల్యేలు 200 మంది ప్ర‌క‌టించారు. అంతేకాదు, భారీ ఎత్తున బ‌హిరంగ స‌భ కూడా నిర్వ‌హించారు. దీనికి అఖిలేష్ కూడా హాజ‌ర‌య్యారు.

అదేస‌మ‌యంలో ములాయం నిర్వ‌హించిన స‌భ‌కు ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా లేక‌పోవ‌డంతో వెనక్కి త‌గ్గిన ములాయం త‌న కొడుకు, త‌మ్ముడిపై విధించిన పార్టీ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. విష‌యం ఇక్క‌డితో ఆగిపోయి ఉంటే స‌మ‌స్య మ‌రోలా ఉండేది. కానీ. అఖిలేష్ దూకుడు మ‌రింతగా కొన‌సాగింది. పార్టీ త‌న‌దేన‌ని, త‌నను అధ్య‌క్షుడిగా భావించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి విజ్ఞ‌ప్తి చేసేందుకు రెడీ అయ్యారు. ఇదే జ‌రిగితే.. ములాయం పేరిట ఉన్న ఎస్పీ పార్టీ.. మెజారిటీ అభ్య‌ర్థుల మ‌ద్ద‌తు నేప‌థ్యంలో అఖిలేష్ వ‌శం అయ్యే అవ‌కాశం ఉందిన తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.