సూర్యాపేట జిల్లా:అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లుగా తయారయింది మోతె మండల కేంద్రం పరిస్థితి ఉందని,పాలకులు ఎవరైనా మోతె మండలాన్ని నిర్లక్ష్యం చేస్తూ రావడం మూలంగా నేటికీ మోతె మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని, అభివృద్ధి కావడానికి ఎంతో అవకాశం ఉండి కూడా అభివృద్ధి కాని దుస్థితి నెలకొని ఉన్నదని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెళ్లి సైదులు సీఎం కేసీఆర్( CM KCR ) కి బహిరంగ లేఖ రాశారు.మోతె మండలంలోఅనేక గ్రామాలలో ఉన్న విద్యార్థిని,విద్యార్థులకు విద్య అందని ద్రాక్షల మారుతుంది.
పదవ తరగతి పూర్తి అయిన తర్వాత పై చదువులు చదవాలంటే సూర్యాపేట, ఖమ్మం వెళ్లాల్సిన పరిస్థితి మండల విద్యార్థులది.మండలంలో అనేకమంది పదవ తరగతితోనే విద్యను ఆపివేస్తున్నారు.
ప్రధాన కారణం ఆర్థిక స్తోమతతో పాటు పై చదువులు చదవాలంటే సుదూరం వెళ్లి చదవాల్సిన దుస్థితి నెలకొని ఉన్నది.దీంతో ఎస్సీ,ఎస్టీ,బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు.
కాబట్టి ప్రభుత్వం తక్షణమే మోతె మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను( Govt Junior College ) ఏర్పాటు చేయడం మూలంగా పేద,మధ్యతరగతి విద్యార్థులకు చదువుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం గత పది సంవత్సరాలుగా సిపిఎం డిమాండ్ చేస్తూ వస్తున్నది.
ఈ ప్రాంతంలో ఉన్నప్రజలు,మేధావులు, రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు ఈ డిమాండ్ పట్ల అనుకూలంగా ఉన్నారు.కానీ,పాలకులకు మాత్రం ఈ సమస్య పట్టడం లేదు.
మోతె మండలానికి జూనియర్ కళాశాల సాధించడానికి త్వరలో అఖిలపక్ష పార్టీలతో,ప్రజా సంఘాలతో,మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నాము.కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సూర్యాపేట జిల్లాలో ఈనెల 20వ తేదీన పర్యటిస్తున్న సందర్భంగా జరిగే బహిరంగ సభలో మోతె మండలానికి జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలని కోరుతున్నాను.