ప్రపంచ మంతటా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి కేవలం కొన్ని దేశాలపై మాత్రమే తన విశ్వరూపం చూపించింది.అందులో ప్రధానంగా అమెరికాపై మాత్రం విరుచుకు పడింది.
ఈ నేపధ్యంలో అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక, ప్రాణ నష్టాన్ని చవి చూసింది.ఊహించని స్థాయిలో అమెరికన్స్ కరోనా కు బలై పోవడంతో ఇప్పటికి అక్కడి ప్రజలు కొత్త వేరియంట్స్ తాకిడికి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు.
ఎప్పుడు ఎలాంటి పెను ముప్పు ముంచుకొస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.అయితే.
అమెరికాలో కరోనా ఏ స్థాయిలో ప్రభావం చూపింది అనే కోణంలో ఎన్నో సంస్థలు పలు రకాల సర్వేలు కూడా చేపట్టాయి.అయితే కరోనా ముందు నుంచీ ఈ మహమ్మారి పై అంచనాలు వేస్తున్న అమెరికా ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది.
గుండెలు బరువెక్కి పోయేలా తన సర్వే వెల్లడించింది.హార్వర్డ్ వర్సిటీకి చెందిన పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ చార్లెస్ నెల్సన్ ఈ పరిశోధన చేపట్టారు.
కరోనా కారణంగా ఇప్పటి వరకూ సుమారు 2 లక్షల మంది పిల్లలు అనాధలయ్యారని తెలిపింది.
ఆర్ధికంగా మనం నష్టపోతే మళ్ళీ ఏదో ఒక పనిచేసుకుని జీవితం సాగించవచ్చు కానీ తల్లి తండ్రులనో లేదంటే తమకు అండగా ఉన్న వారిని పిల్లలు కోల్పోతే ఆ లోటు వారి జీవితం మొత్తం ఉంటుందని, కరోనా పిల్లలకు మిగిల్చిన అతి పెద్ద నష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
వారికి ఆర్ధిక నష్టం కంటే కూడా మానసిక నష్టం ఎంతో ఉంటుందని, వారికి ఇప్పుడు ఎంతో ధైర్యం అవసరమని తెలిపారు.ఇలాంటి సమయంలో పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఎన్నో మానసిక రుగ్మతలతో పిల్లలు బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు.