వృద్ధ సింహాలు జూలు విదులుస్తాయా..       2018-07-09   02:40:56  IST  Bhanu C

ఏపార్టీ అయినా యువ‌త‌కు పెద్ద పీట వేయాల‌ని చూస్తుంది. యువ‌త త‌మ పార్టీలోకి వ‌స్తే.. జోరు హుషారు పెరుగుతుంద‌ని అనుకుంటారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ముసుగుక‌ప్పుకొని ప‌డుతున్న వృద్ధ నాయ‌కుల‌ను త‌ట్టి మ‌రీ లేపి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. వారి వ‌ల్ల‌నే పార్టీకి భ‌విష్య‌త్తు ఉంద‌ని చెప్పుకొస్తోంది. మ‌రి ఇలాంటి పార్టీని ఏమ‌నాలి? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న నెటిజ‌న్లు సంధిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.,. కాంగ్రెస్ దౌర్భాగ్య‌మో.. ఏమో.. వైఎస్ లాంటి నాయ‌కుడు మాత్రం ఆ పార్టీకి ల‌భించ‌డం లేదు. కేర‌ళ‌లో పార్టీ పుట్టిముంచిన ఊమెన్ చాంది.. ఇక్క‌డ అడ్ర‌స్ గ‌ల్లంతైన కాంగ్రెస్‌కు స‌జీవ క‌ళ తెచ్చి.. స‌మ‌స్య‌లపై పోరాటం చేయ‌డంతోపాటు కుదిరితే అధికారంలోకి కూడా తెస్తార‌ట‌.

ఈ నేపథ్యంలో ఇక్క‌డ అడ్ర‌స్ పూర్తిగా గ‌ల్లంతైన కాంగ్రెస్‌కు వృద్ధ నేత‌ల‌తో సిలైన్ ఎక్కించే ప‌ని ప్రారంభించార‌ట‌. దీంతో చాందీ ‘మన ఇంటికి వచ్చేయండి’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘పార్టీ బలోపేతం కావాలంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోన్న పాలకపక్షం తెలుగుదేశంపై విమర్శనాస్త్రాలు సంధించడం ఒక్కటే చాలదు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించేలా కృషి చేయడంలో విఫలమవుతున్న ప్రధాన ప్రతిపక్షాన్నీ తప్పుపట్టాల్సిందే’’ అంటూ తమ అభిప్రాయలను వెల్లడించారు.అనంతరం రాహుల్‌ ‘పార్టీని వీడిన ముఖ్య నేతలు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి వచ్చేలా చర్యలు తీసుకోండి’ అంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీని ఆదేశించారట‌.

బలహీనమైన నేతలతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం కంటే.. ప్రజాకర్షణ కలిగిన నాయకులతో బలమైన కార్యవర్గ కూర్పే మంచిదని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. దీంతో చాందీ రంగంలోకి దిగారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో సమావేశమయ్యారు. ఆ తరువాత తన చిరకాల మిత్రుడు, కాంగ్రెస్‌ కురువృద్ధుడు, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య నివాసానికి వెళ్లారు. సీనియర్‌ నేతగా, కాంగ్రెస్‌ వాదిగా పార్టీ బలోపేతానికి సలహాలివ్వాలని ఊమెన్‌ కోరడంతో రోశయ్య సరేనన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డితోనూ ఊమెన్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి రావాలంటూ ఆహ్వానించారు.

అయితే కిరణ్‌ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఊమెన్‌కు చెప్పినట్లు సమాచారం. ఇక‌, రేపో మాపో.. రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ను సైతం క‌లుసుకుని పార్టీలోకి ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రి ఈ కురువృద్ధులు, అస్త్ర స‌న్యాసులు పార్టీకి ఆధారం అవుతారా? పార్టీని విజ‌య‌తీరం చేరుస్తారా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి వృద్ధ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.