తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం చివరకు ఏ విధంగా తేలుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.పార్టీకి ,పదవికి రాజీనామా చేస్తానంటూ జగ్గారెడ్డి ముందు చెప్పినా, అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి వారిపై బహిరంగంగా విమర్శలు చేసినా, అధిష్టానం నుంచి పెద్దగా స్పందన అయితే కనిపించలేదు.
దాదాపు ఆయన టిఆర్ఎస్ లో చేరడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు.
తాజాగా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన జగ్గారెడ్డి అనేక అంశాలపై స్పందించారు.
చివరకు పార్టీ సీనియర్ నాయకులు సూచన మేరకు తాను 15 రోజుల వరకు రాజీనామా పై ఎటువంటి కామెంట్స్ చేయనని , తనను కలిసిన వారు సోనియా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ జగ్గారెడ్డి కోరారు.
దీంతో సీనియర్ నాయకులు మంత్రాంగం ఫలించిందని , జగ్గారెడ్డి కాంగ్రెస్ ను వీడి బయటకు వెళ్లే ఆలోచనను విరమించుకున్నారని అంతా అభిప్రాయపడుతున్నారు.జగ్గారెడ్డి ఇప్పటికే సోనియాకు మూడు పేజీల లేఖను రాశారు.ఈ రోజు నిర్వహించిన సమావేశంలో మాత్రం కాంగ్రెస్ విషయం సానుకూలంగానే ఆయన స్పందించారు.
తనకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఎటువంటి కోపం లేదని , తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.గాంధీభవన్ లో కొంతమంది కామెంట్ చేశారు అని తనకు తెలిసిందని తన సమస్యకు మందు తన దగ్గరే ఉందని, ఇదంతా టీ కప్ లో తుఫాను మాత్రమేనా అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అని, అసలు మూలాలకు వారు వెళ్లడంలేదని జగ్గా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ్యత్వ నమోదు ఇంచార్జి వేణుగోపాల్ రెడ్డి పైన జగ్గరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.జగ్గారెడ్డి పార్టీని వీడి బయటకు వెళుతున్నారు అనే అంశంపై వేణుగోపాల్ రెడ్డి ‘ పోతే పోనీ దరిద్రం పోతుందని కామెంట్ చేసినట్లు జగ్గారెడ్డి కి సమాచారం అందడంతో వేణుగోపాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి సన్నిహితులే తనపై ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.తనకు 15 రోజుల్లోగా సోనియా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకాలని , దొరకని పక్షంలో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది అప్పుడు ప్రకటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.