ఏపీలో ఎవరు గెలిచినా ఈ చిక్కులు తప్పవా ?  

Complications Cannot Be Resolved In Andhra Pradesh-budget,complications,party,political Updates,resolved,ruling,tdp

ఏపీలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ పార్టీ అధికారం దక్కించుకున్న ఆయా పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మాత్రం కత్తిమీద సామే. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ను మించిపోయేలా ఆయా పార్టీలు హామీలు గుప్పించేశాయి..

ఏపీలో ఎవరు గెలిచినా ఈ చిక్కులు తప్పవా ?-Complications Cannot Be Resolved In Andhra Pradesh

ఆ హామీలు అసలు అమలు సాధ్యమా అని ఎన్నికల ముందే అందరూ నోరెళ్లబెట్టారు. కానీ ఆయా రాజకీయ పార్టీలు మాత్రం మేము చేసి చూపిస్తాం అంటూ గంభీరంగా వాగ్దానాలు చేశాయి. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా , టీడీపీ అధికారం లోకి వచ్చినా పరిపాలన మాత్రం కత్తిమీద సామే అన్నట్టుగా పరిస్థితి ఉండబోతోంది.

ఇప్పుడు ఎవరు అధికారం దక్కించుకున్నా, ఇప్పుడు వస్తున్న పింఛన్లు మూడు వేలు చేయాలి. నిరుద్యోగ భృతి పెంచాలి. కేంద్రం ఇచ్చిన వ్యవసాయ హామీకి తన హామీ జత చేయాలి.

ఇంకా చాలా హామీలు వున్నాయి. వీటన్నింటికీ డబ్బు కావాలి. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

పసుపు కుంకుమ కోసం బ్యాంకుల దగ్గర బాండ్లు పెట్టి అప్పు తెచ్చారు. మలి విడత అప్పు తేవాలంటే కేంద్రం కుదరదని చెప్పేసింది. కేంద్రంలో మళ్లీ మోదీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు బలంగా వస్తున్నాయి.

ఒక వేళ రాకపోతే పరవాలేదు. వస్తే కనుక ఇదివరకుటిలా నిధులు తెచ్చుకునేందుకు మాత్రం కాస్త గట్టిగానే కష్టపడాల్సి వస్తుంది.

గత అయిదు సంవత్సరాలుగా చూస్తే ఇబ్బడిముబ్బడిగా రుణాలు తెచ్చారు. మున్సిపాలిటీల ద్వారా విడివిడిగా లోన్లు తెప్పించి, పట్టణాల సుందరీకరణ చేశారు.

అది రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు. ఇంతవరకు బాగానే వుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి..

పన్నులు పెంచితే ఓ బాధ, పెంచకపోతే మరో బాధ. మరోపక్క ఉద్యోగుల పీఆర్సీ ఉంది. దాని అరియర్స్ వున్నాయి.

చిరకాలంగా డిఎ బకాయిలు వున్నాయి. వీటన్నింటికి నిధులు కావాలి. ఎక్సయిజ్, రిజిస్ట్రేషన్, జీఎస్టీ ఆదాయాలే దక్కు.

అలాగే కేంద్రం నుంచి వచ్చే వాటాలు. కానీ కేంద్రం ఆ వాటాలను వివిధ పద్దుల కింద ఇస్తే, అందుకే ఖర్చు చేయాలి అంటోంది. ఇవన్నీరాబోయే కొత్త ప్రభుత్వానికి సవాల్ విసిరే సమస్యలే.

అది చంద్రబాబు ప్రభుత్వం అయినా, జగన్ ప్రభుత్వం అయినా చిక్కులు మాత్రం తప్పవు.