‘అరవింద సమేత’కు ప్రభాస్‌ సినిమాతో పోలిక అంటున్నారు     2018-10-04   08:41:34  IST  Sainath G

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్‌ను చూస్తుంటే ఈ చిత్రంకు ‘మిర్చి’ చిత్రంకు మద్య సన్నిహితంగా పోలికలు ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అరవింద సమేత చిత్రం ఫ్యాక్షన్‌ గొడవల నేపథ్యంలో తెరకెక్కింది.

ఒక యువకుడు రాయలసీమ గొడవలను ఆపేయాలని, ఫ్యాక్షన్‌ను వదిలేసి దూరంగా బతికేయాలని భావిస్తు ఉంటాడు. ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ అనే విషయాన్ని అరవింద సమేత చిత్రంలో చూపించినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక మిర్చి చిత్రంలో కూడా ఊరి గొడవలకు తల్లిని పోగొట్టుకున్న ప్రభాస్‌ ఆ గొడవలకు దూరంగా ఉండాలని భావిస్తాడు. దానికి తోడు అందరిని మంచిగా చేయాలనే పట్టుదలతో చాలా కష్టపడతాడు. తాజాగా ట్రైలర్‌ను చూస్తుంటే అరవింద సమేత చిత్రం కూడా అలాగే ఉంటుందనే అనిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన పొటోలు పక్క పక్కన పెట్టి తెగ పోలికలు కడుతున్నారు. ప్రభాస్‌ మరియు ఎన్టీఆర్‌లు చేతిలో కత్తి పట్టుకుని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొత్తానికి ఈ అరవింద సమేత చిత్రం మరో మిర్చి అంటూ జరుగుతున్న ప్రచారం కారణంగా నందమూరి అభిమానులు ఒకింత ఆందోళనకు గురి అవుతున్నారు.

త్రివిక్రమ్‌ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌ అయ్యింది. ఆ కారణంగా ఈ చిత్రంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అరవింద సమేత చిత్రంపై ఎన్టీఆర్‌ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. 12 ఏళ్ల కల నెరవేరినట్లుగా అనిపిస్తుందని, త్రివిక్రమ్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇది తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఎన్టీఆర్‌ వ్యక్తం చేశాడు.