కమ్యూనిస్టు పార్టీలు పునరాలోచించాలి..

ఈ మ‌ధ్య మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాట్లాడుతూ కాంగ్రెస్ మూడవ స్థానానికి పడిపోయింది అని సెలవిచ్చారు.మరి కమ్యూనిస్టులు ఏ స్థానంలో ఉన్నారో ప్రజలు చెప్పాలి.

 Communist Parties Should Rethink, Cpi, Cpm, Munugodu, By-elections, Trs , Bjp ,-TeluguStop.com

వెస్ట్ బెంగాల్, త్రిపుర లో ఒక్క సీటు దక్కించుకోలేదు.గతంలో లాల్ నీల్ కలయిక అని ఒక ప్రాంట్ ఏర్పాటుచేసి కాంగ్రెస్ గెలిచే సీట్లల్లో ఓట్ల చీలిక చేసి టీఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చే బి టీం తయారు చేశారు.

ముందు వెనుక ఆలోచించకుండా సిపిఐ కూడా టీఆర్ఎస్ తో జత కలిపింది.గతంలో జనసేన తో అంటకాగి తిరిగారు.

వీరి అధినాయకత్వం జాతీయ మహాసభలకు వచ్చినప్పుడు ఐక్యత గురించి, మతోన్మాద పార్టీల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు.రాష్ట్రాలలో వాస్తవ పరిస్థితి తెలియదా ? లేక రాష్ట్ర నాయకులు చెప్పేవి గుడ్డిగా నమ్ముతున్నారా.ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేసుకోవడం లో రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యారు.నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుంది.కుక్క తోక ఆడించాలి కానీ ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు తోకే కుక్కను ఆడిస్తున్నట్లు ఉంది.రాజకీయ, సామాజిక వ్యవస్థలు ఎలా రూపాంతరం చెందుతాయో చూపెట్టడానికి మార్క్స్‌ గతితార్కిక భౌతికవాదం లేదా చారిత్రక భౌతికవాదాన్ని ప్రతిపాదించి, పుట్టుక వంశం ఆధారంగా నడుస్తున్న రాచరిక, కులీన రాజ్యవ్యవస్థ నుండి సామర్థ్యం, పెట్టుబడి ఆధారమైన క్యాపిటలిస్ట్‌ వ్యవస్థ ఉద్భవించిందనీ, దీని ఆధారంగానే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనీ, దానిలో ఉన్న శ్రమదోపిడీ, సంపద కేంద్రీకరణ వంటి వైరుధ్యాల వలన పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరగబడి శ్రామికులే ఉత్పత్తి సాధనాలను, తద్వారా రాజ్యపాలన చేజిక్కించుకుంటారనీ సూత్రీకరించారు.

ఇప్పుడు ఇంకో కొత్త వ్యవస్థ పాత దానికంటే మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుంది.కాని దానిలో కూడా అంతర్గత వైరుధ్యాలు ఉంటాయి.అవి మళ్ళీ క్రమేణా పెరిగి, ఉన్న వ్యవస్థలోని లోపాలను, వైరుధ్యాలను తొలగించి అంతకంటే ఉత్తమమైన వ్యవస్థను దాని స్థానంలోకి తెస్తుంది.వైరుధ్యాలకు జవాబు లేదా పరిష్కారం కొత్త వ్యవస్థలో ఉండి ఉత్తమంగా అనిపిస్తుందే కాని ప్రామాణికంగా కాదు.

ముందు దానికంటే ఎక్కువ వైరుధ్యాలు, లోపాలు కూడా ఉండవచ్చు.ఇది నిరంతరం, నిర్విరామం, విశ్వజనీనం.

మొత్తం ప్రపంచాన్ని మార్చాలంటే మార్క్సిస్టు అవగాహన కావాలి.కానీ, కులవ్యవస్థ ఉన్న భారతదేశంలో మధ్యేమార్గంలో ఒక సామాజిక విప్లవం రావాల్సిన అవసరం ఉంది.

ఆ సామాజిక విప్లవానికి ఓటు చాలా అవసరం.మార్క్స్, అంబేడ్కర్ సిద్ధాంతాల పునాది మీద దీనిని నిర్మించటానికి కమ్యూనిస్టులు ప్రయత్నించాలి.

భారత కుల వ్యవస్థపై కమ్యూనిస్టు పార్టీలకు ఒక స్పష్టమైన అవగాహన చాలాకాలంగా రాలేదు.కులం ఒక ఉపరితలం మాత్రమే అనుకున్నారు.ఆర్థిక పునాది మారిపోతే, అన్నీ మారిపోతాయనుకున్నారు.భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలని భక్తి యుగం నుంచి పోరాటాలు జరిగాయి.

కులం అన్నది క్లాస్ అండ్ కాస్ట్ రెండూ కలగలసినది అని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు.కులం అన్నది ఉపరితలంలో మాత్రమే కాదు.

దేశ పునాదిలోకూడా ఉందని కమ్యూనిస్టులు అర్థం చేసుకున్నపుడు ఎవరి సిద్ధాంతాలను తీసుకోవాలి? ఆర్థిక పునాదిగా ఉన్న ఒక్క మార్క్స్ మాత్రమే దేశానికి సరిపోతాడా? కులం, వర్గం రెండూ పోవాలని జమిలి ఉద్యమాలు జరగాలని అనేకమంది ఉద్యమాలు చేశారు.

Telugu Congress, Munugodu, Rajgopal Reddy, Ts Poltics-Political

మునుగోడు 1967లో నియోజకవర్గంగా ఏర్పడింది.తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విజయఢంకా మోగించారు.అప్పటికే ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది.

అయితే ఇప్పటివరకు అక్కడ 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సీపీఐ, ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి.మొత్తంగా చూస్తే కాంగ్రెస్, సీపీఐ పార్టీలే ప్రధానంగా పోటీపడ్డాయని చెప్పాలి.

అక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీకీ బ్రేక్ వేసిన సీపీఐ 1985లో ఉజ్జిని నారాయణ రావును తమ అభ్యర్థిగా నిలబెట్టి విజయం సాధించింది.ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రస్తుతం మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో ఎర్ర జెండాల అడుగులు ప్రగతి భవన్ వైపు చూడటం సరికాదు.సొంతంగా పోటీ చేసి మునుగోడు గడ్డపై మళ్లీ ఎర్ర జెండాను పాతే ఉద్దేశం లేనప్పుడు భావ స్వరూప్యత కలిగిన పార్టీలకు మద్దతు తెలుపడం మంచిది.

ఆలా కాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వారితో జత కట్టడం ఎందుకు.ఎనిమిదేళ్లలో ఒక్కరోజు సెక్రెటేరియేట్ రాని వ్యక్తి, ఒక్కటంటే ఒక్క అధ్యాపక పోస్టు భర్తీ చేయని, మూఢ విశ్వాసాలతో మూర్తీభవించిన వ్యక్తి తో దోస్తీ కట్టడం మంచిది కాదు.

కార్పొరేట్లు, కాంట్రాక్టర్లను, మతోన్మాదులను నిలువరించడానికి ఇది సరియైన తరుణంగా భావించి ఐక్య ఉద్యమాలకు బాసటగా నిలవాలి.సిద్ధాంతపరంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు పెద్ద తేడా లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube