ఆ ఏపీ మంత్రి ప్ర‌జాసేవ‌లో లాస్ట్ - ప్ర‌చారంలో ఫ‌స్ట్‌   Commnets Over Ravela Kishore Babu Advertising Campaign     2017-01-05   23:39:25  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రులంతా ఎవ‌రి దారి వారిది అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిలో రావెల కిశోర్ బాబు తీరు అనేక విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప్ర‌జాసేవ కంటే ప్ర‌చార ఆర్భాటానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ప‌లువురు అధికారులు బాహాటంగానే ఆయ‌న తీరును ఎండ‌గ‌డుతున్నారు. సామాజిక‌వ‌ర్గ‌పు అండ‌తో చంద్రబాబును బుట్ట‌లో వేసుకుని.. అటు రాజ‌కీయంగా ఇటు అధికారికంగా త‌న‌కు ఎదురు లేకుండా చూసుకోవ‌డంలో ఆయన విజ‌యం సాధించార‌నే ఆరోప‌ణలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో అనేక సంవ‌త్స‌రాలు రావెల ప‌నిచేశారు. అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌కాకుండా.. ప్ర‌భుత్వ వాహ‌నానికే ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని, ప్ర‌చారానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు గుంటూరు న‌గ‌రంలో జోరుగా వినిపిస్తున్నాయి. న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా ఆయ‌న ఫ్లెక్సీలే! ఒక్కొక్క బజార్‌లో పెద్ద పెద్ద కటౌట్‌లు, ఒక పక్క చంద్రన్న బొమ్మ…మరో పక్క ‘రావెల’ బొమ్మ..దళిత, గిరిజన పథకాల వివరాలు ఆ బోర్డులపై కనిపిస్తున్నాయి. బస్టాండ్ నుంచి విజ‌య‌వాడ ర‌హ‌దారి, మార్కెట్ దారుల్లో ఎక్క‌డ చూసినా ఇవే!!

రావెల ప్ర‌చార తీరుపై మిగిలిన సామాజిక‌వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతోపాటు స్థానిక సంస్థల ప్రతినిధులతో రావెల‌ కయ్యానికి దిగుతున్నారు. దీనికి తోడు ఆయన కుటుంబ స‌భ్యులు.. అధికారుల‌ను బెదిరిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవల రావెల కుటుంబ సభ్యుడి వ్యవహారంపై ఒక అధికారి సీఎంవో అధికారుల‌కు ఫిర్యాదు చేశారు కూడా!

ఇదే జిల్లాకు చెందిన మ‌రో మంత్రి పుల్లారావుకు రావెల వ్య‌వ‌హారం చెప్పినా..ఆయ‌న కూడా కిమ్మ‌న‌కుండా ఉంటున్నార‌ట‌. నియోజకవర్గంలో తిరుగుబాటు, అధికారుల్లో వ్యతిరేకతను తట్టుకునేందుకు ప్రభుత్వ సంక్షేమపథకాల ప్రచారాన్ని కవచకంగా మలుచుకుంటున్నారు. ఇక ఆయ‌న ఇద్ద‌రు కుమారులు మ‌హిళ‌పై దాడి చేయ‌డం, లేడీస్ హాస్ట‌ళ్లో చొర‌బ‌డ‌డం లాంటి అంశాల విష‌యంలో సైతం ఆయ‌న పెద్ద విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

మంత్రిగా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి మాత్రం అస్స‌లు లేద‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు సైతం రావెల తీరుపై తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌ జరిగినా.. సామాజిక‌వ‌ర్గ‌మే త‌న‌ను కాపాడుతుంద‌ని రావెల ధీమాగా ఉన్నార‌ట‌.