కలిసి పోరాడితేనే దక్కును ఫలితం       2018-06-17   00:14:54  IST  Bhanu C

కలిసి ఉంటే కలదు సుఖం, కలదు లాభం అనే సామెత తెలుగులో బాగా ఫేమస్‌. అలాగే కలిసి పోరాడితేనే ఏదైనా సాధ్యం అనే విషయం కూడా అందరు తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సామెతను గుర్తించాల్సిందిగా సామాన్య ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కేంద్రంపై చిన్న స్థాయి యుద్దం చేస్తున్నారు. అయితే విడి విడిగా ఆ యుద్దం సాగుతున్న కారణంగా ఇద్దరికి కూడా ఫలితం దక్కడం లేదు. అందుకే ఇద్దరు కలిసి పోరాడితే తప్పకుండా ఫలితం ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను నెరవేర్చాలంటూ తెలుగు దేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఆందోళన సాగిస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం బయటకు వచ్చి మరీ ఉద్యమం చేస్తుంది. ఇక మరో వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కూటమినే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న కేసీఆర్‌ తాజాగా మోడీతో భేటీ అయిన విషయం తెల్సిందే.

నేడు జరుగబోతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వేరు వేరు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ల సీఎంతో భేటీ అయ్యి ఇప్పటికే కేంద్రంకు వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన వ్యూహంను సిద్దం చేసుకున్నారు. వీరితో పాటు తెలంగాణ సీఎం కూడా కలిసి ఉంటే మరింత ఒత్తిడి కేంద్రంపై ఉండేది అంటూ రాజకీయ నాయకులు మరియు కేంద్ర నాయకత్వం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.

ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కూడా ఈగోలకు వెళ్లి ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఇద్దరు కూడా కేంద్రం వద్ద సరైన ఒత్తిడిని తీసుకు రావడంలో విఫలం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పోరాడితే తప్పకుండా జాతీయ స్థాయిలో ఫలితం ఉంటుందని అంతా నమ్ముతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీఆర్‌ఎస్‌, టీడీపీలు ఉన్నాయి. అందుకే ఈ రెండు కలిస్తే 2019లో ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని, వీరు చెప్పిన వ్యక్తి పీఎం అవ్వడం లేదా వీరిద్దరిలోనే ఎవరో ఒకరు పీఎం అవ్వడం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని వీరిద్దరు కలిసి పోరాడేందుకు మాత్రం ఆసక్తిగా ఉన్నట్లుగా కనిపించడం లేదు.