మ‌ల్కాజిగిరి నుంచి మెగాస్టార్ చిరంజీవి..?       2018-06-07   02:18:35  IST  Bhanu C

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ త‌న వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెడుతోంది. వ‌చ్చే అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాల‌ను గెలుచుకునేందుకు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్ర‌ధానంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని సెటిల‌ర్లను త‌న‌వైపు తిప్పుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంగా.. స‌గానికికంటే ఎక్కుమంది సెటిల‌ర్లు ఉన్న మ‌ల్కాజిగిరి స్థానం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు టీపీసీసీ వ‌ర్గాలు ఇప్ప‌టికే పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ చెవిలో కూడా వేసిన‌ట్లు తెలిసింది.

నిజానికి రెండేళ్ల క్రితం జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సెటిల‌ర్లంద‌రూ టీఆర్ఎస్‌కు అండ‌గా ఉన్నారు. ఏకంగా 99మంది కార్పొరేట‌ర్ల‌ను ఆ పార్టీకి అందించ‌డంలో సెటిల‌ర్ల ఓట్లే కీల‌క‌మ‌ని అంద‌రూ ఒప్పుకోవాల్సిందే. అయితే వ‌చ్చే అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం ఎలాగైన సెటిల‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. మ‌ల్కాజిగిరి నుంచి కేంద్ర‌ మాజీ మంత్రి చిరంజీవిని బ‌రిలోకి దించితే ఆ ప్ర‌భావం నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంద‌నీ, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 29 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సెటిల‌ర్ల ఆలోచ‌న మారే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబించ‌డం, ఇదే స‌మ‌యంలో బీజేపీకి ద‌గ్గ‌ర‌గా ఉంటున్నార‌నే టాక్ వినిపిస్తున్న నేప‌థ్యంలో సెటిల‌ర్లు కొంత గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు చిరంజీవిని రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లో దాదాపుగా హైద‌రాబాద్‌తోపాటు ఇత‌ర జిల్లాల్లోని 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో సెటిల‌ర్లు గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించే స్థాయిలో ఉన్నారు.