టీడీపీ కి “పవన్” మేలు చేస్తే .. “సొంత నేతలు” కీడు చేస్తున్నారా ..?       2018-05-11   03:10:07  IST  Bhanu C

టీడీపీ నాయకుల్లో ఉన్న అంతర్గత లోపలను చక్కదిద్దే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అందుకే కొంచెం కఠినంగానే పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్నారు. అలా ఉండకపోతే అదే అదునుగా భావించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ పార్టీని దెబ్బతీస్తారని బాబు ఆలోచన. అందుకే పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల అందరి మీద నిఘా పెట్టారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. నోటి దురద ఎక్కువగా ఉన్న నాయకుల తోకలు కట్ చేసే పనిలో బాబు ఉన్నారు.

ఎందుకంటే గతంలో ఈ నోటి దురద నాయకులను హెచ్చరించినా ఫలితం కనిపించకపోవడంతో బాబు వారిపై గట్టిగానే సీరియస్ అవుతున్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నాడనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇటువంటి దశలో సొంత పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా మారడంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలు ప్రారంభించాడు. పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి చేరడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

కేవలం ఎమ్యెల్యేలే కాకుండా వారి బంధువులు కూడా నియోజకవర్గంలో అన్ని తామై వసూళ్లకు పాల్పడడంతో దానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇటువంటి వ్యవహారాలపై చంద్రబాబు అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోపగించుకున్నప్పుడు కొంతమేరకు తగ్గినట్టే తగ్గి ..ఆ తర్వాత మా పని మాదే అన్నట్టు వ్యవహారాలు నడుపుతున్నారు…టీడీపీలో అత్యంత విశ్వసనీయ విషయాలను కూడా కొంతమంది నేతలు ప్రత్యర్థులకు లీక్‌ చేస్తున్నారన్న విషయాన్ని టీడీపీ అధిష్టానం పసిగట్టింది.

అందుకే బాబు నిర్వహించే అంతర్గత టెలీకాన్ఫరెన్స్‌ ల్లో, సమీక్షల్లో పాల్గొన్న ఈ నోటి దురద నేతలకు నో ఎంట్రీ అని చెప్పేశారట. అంతే కాకుండా వారికి టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా కాల్ కలపవద్దని ఆదేశాలు అందాయట..కేవలం ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీ లో సంచలనం సృష్టించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్‌ చేసిన విమర్శలతో కొంతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు కంగారుపడ్డారు. టీడీపీ వెంటనే ఎదురుదాడి ప్రారంభించడంతో పవన్‌ వెనక్కు తగ్గారు.

ఎన్నికలకు ఏడాది ముందుగానే టీడీపీతో పొత్తు ఉండదని పవన్‌ చెప్పడం ఓ రకంగా మేలే చేసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి..ఆయన పార్టీ వైఖరి ఏమిటన్నది ముందుగానే తెలియడంతో టీడీపీ మానసికంగా సిద్ధమయ్యేందుకు అవకాశం దొరికిందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు…అంతే కాకుండా పవన్‌కల్యాణ్‌, జగన్ లు ఇద్దరూ కలిసిపోతున్నారని, వీరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. పవన్‌-జగన్‌లను బీజేపీ నడిపిస్తోందన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ ముందడుగు వేసింది.