నిలదీస్తాడా ..? నీళ్లు నములుతాడా ..? మోదీతో తాడోపేడో తేల్చేస్తానంటున్న బాబు !       2018-06-14   03:21:19  IST  Bhanu C

ఏపీ ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా… కేంద్రం కక్షపూర్తితంగా వ్యవహరిస్తూ తీరని అన్యాయం చేస్తోందని ..ఆరోపిస్తూ గత కొంతకాలంగా టీడీపీ చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. నాలుగేళ్లపాటు ఎన్డీయేలో చురుకైన పాత్ర పోషించిన టీడీపీ ఆ తరువాతమారిన పరిణామాలతో బయటకి వచ్చేసింది. ఇక అక్కడి నుంచి బీజేపీ పేరు చెప్తే ఒంటి కాలిపై లేస్తోంది టీడీపీ.

ఏపీ ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి కారణం మోదీనే అంటూ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. క్రిడిట్ వస్తే నాకు లేకపోతే మోదీకి అన్నట్టు బాబు తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు.ఏ దశలో ప్రధానిపై పరుష వ్యాఖ్యల్ని చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. బహిరంగ సభల్లో రోజుకో తీరుతో మోడీపై మండిపడుతున్న బాబు తాజాగా తాను వెళ్లే నీతి అయోగ్ మీటింగ్ లో ప్రధానిని నిలదీసి తాడో పేడో తేల్చేస్తా అంటూ గంభీరంగా మాట్లాడుతున్నాడు.

ఈ మధ్యన టీడీపీ.. బీజేపీ మధ్య పోరు ముఖాముఖిగా మారింది. మొన్నటివరకూ ప్రధాని మోడీపై బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని అదే పనిగా ప్రస్తావిస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో ప్రధాని ఇచ్చిన మాటను తప్పుతున్నారంటూ పడే పడే ప్రస్తావిస్తున్నారు.

అలాగే,… బాబుపై ఎదురుదాడిని ఏపీ బీజేపీ నేతలు మొదలు పెట్టారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కన్నా.. గొంతు సవరించుకొని బాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ దశలో తన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రధాని మోడీకే చూపించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయ విమర్శల మాదిరి కాకుండా.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అందరి ముఖ్యమంత్రుల ముందు నిలదీయాలని చూస్తున్నాడు.

కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేయటం.. దుబారా చేస్తున్నట్లుగా కమలనాథులు చేస్తున్న వాదనను తిప్పి కొట్టటంతో పాటు.. వివిధ కేంద్ర పథకాల కింద రాష్ట్రానికి వచ్చిన సాయం.. రావాల్సిన పెండింగ్ లెక్కల్ని ప్రస్తావిస్తూ మోదీని ముప్పుతిప్పలు పెట్టి నోటిమాట రాకుండా చేయాలనీ బాబు చూస్తున్నాడు.