వారు 'హ్యాండ్' ఇస్తారని తెలిసినా బాబు వదలడంలేదే ?  

Chandrababu To Help Congress-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమి చేసినా అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు ఎక్కువగా నమ్ముతుంటారు. బాబు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టుగా భ్రమింపచేయడంలో ఆయన సిద్ధహస్తుడు. బీజేపీతో పొత్తు చారిత్రాత్రమక అవసరం అంటూ ఆయన పాలన ప్రజల అదృష్టం అంటూ ఆకాశానికి ఎత్తెయ్యడం , ఆ తరువాత మోదీ పాలన లో మనమంతా ఉండడం మన దురదృష్టం, అర్జంటుగా ఆయన గద్దె దిగిల్సిందే అంటూ గర్జించే డైలాగులు చెప్పినా అవన్నీ బాబుకే చెల్లు..

వారు 'హ్యాండ్' ఇస్తారని తెలిసినా బాబు వదలడంలేదే ?-Chandrababu To Help Congress

మోదీతో బాబు తెగతెంపులు చేసుకున్నాక కాంగ్రెస్ పార్టీకి ఆయన బాగా దగ్గరయ్యారు. దేశానికి కాంగ్రెస్ పరిపాలన కావాలని, రాహుల్ ప్రధాని అవ్వాలని బాబు దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది.

మమతా బెనర్జీ , మాయవతి, సమాజ్ వాదీ పార్టీ అయినా రాహుల్ ను అతిగా భుజానికి ఎత్తుకోవడం లేదు. కాంగ్రెస్ తరఫున ప్రచారానికీ రావడంలేదు. వాళ్లకు కాంగ్రెస్ తో చాలా అవసరమే ఉంది.

పరిస్థితుల దృష్ట్యా ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీలు ఎటు తిరిగీ కాంగ్రెస్ తోనే కలిసి ఉండాలి. అయినా అవి కాంగ్రెస్ ను ప్రస్తుతానికి దూరంగానే పెడుతున్నారు. అయితే ఈ విషయంలో బాబు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

కాంగ్రెస్ పార్టీ గెలవడం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవసరమో కాదో తెలియదు కానీ తమకు మాత్రం అవసరమే అన్నట్టుగా బాబు కాస్త గట్టిగా కష్టపడిపోతున్నాడు. బాబు ఇంత గట్టిగా కష్టపడడం వెనుక ఓ కారణం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రాకూడదు అన్నదే బాబు మార్క్ ఆలోచన.

అందుకో కాంగ్రెస్ గెలుపు కోసం శతవిధాలా కష్టపడిపోతున్నాడు. అయితే ఇక్కడే బాబు ఓ విషయం మర్చిపోతున్నాడు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ కు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ తగిన సీట్లు రాకపోతే బాబు ని కాంగ్రెస్ నిర్మొహమాటంగా దూరం పెట్టేస్తుంది.

అంతే కాదు ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లను ఎవరు గెలిస్తే వారినే కాంగ్రెస్ భుజానికి ఎత్తుకుంటుంది. జగన్ మా వాడే అంటూ కాంగ్రెస్ పెద్దలు వైసీపీ చుట్టూ తిరగడానికి ఎక్కడా మొహమాటం పడరు. ఇవన్నీ బాబుకి ముందే తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో బాబు కు ఇంకో ఆప్షన్ అయితే కనిపించడంలేదు.