వారికే టికెట్లు ఇవ్వండి కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ తయారుచేసిన బాబు       2018-07-07   01:26:37  IST  Bhanu C

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని ఎవరన్నారో కానీ అది మాత్రం అక్షరాలా నిజం. ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం ఎవరితో కలవడానికైనా.. ఎవరితో శత్రుత్వం పెట్టుకోవడానికైనా వెనుకా ముందు ఆలోచించరు. అసలు రాజకీయాల్లో విలువలు .. నీతి నిజాయితీల గురించి వెతకడం ఇసుక నుంచి నునే తీసినట్టే అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. ఇక అసలు సంగతికి వస్తే.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీనే. కానీ ప్రస్తుతం రాజకీయ అవసరాల కోసం ఆ పార్టీకి టీడీపీ దగ్గరవుతోంది. ఆఖరికి ఆ పార్టీ కి మొత్తం వెనకుండి రాజకీయ ఎత్తుగడలు వేయించే పని టీడీపీ తీసుకుంది. ఇది నమ్మేందుకు ఇస్తాపడకపోయినా ఇదే నిజం.

బీజేపీతో ఉన్న కోపంతో ఇప్పుడు ఆ పార్టీని ఎదుర్కోవడానికి … కాంగ్రెస్ తో జతకట్టేందుకు బాబు సిద్దమయ్యాడు. మొన్నటి వరకు సోనియా గాంధీని దయ్యం, ఇటలీ రాక్షసి అంటూ దూషించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తికి సిద్దమయ్యారు. ఈ మేరకు రాహుల్‌ దూతతో చంద్రబాబు మంతనాలు జరిపారు. ఇక నుంచి బాబు డైరెక్షన్ లో ఏపీ కాంగ్రెస్ ను నడిపేందుకు రాహుల్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. పొత్తు కోసం తన వద్దకు వచ్చిన రాహుల్‌ దూతకు చంద్రబాబు ఒక జాబితా అందజేసినట్టు చెబుతున్నారు. జాబితాలోని వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే మంచి జరుగుతుందని చంద్రబాబు సూచించాడట. 2014లో పొత్తుల సమయంలో తన వారిని బీజేపీలోకి పంపించి వారికి పొత్తులో భాగంగా టికెట్లు దక్కేలా చంద్రబాబు చేయగలిగారు.ఇప్పుడు ఇదే ఫార్ములాను కాంగ్రెస్ పై ప్రయోగిస్తున్నారు బాబు.

చంద్రబాబుతో చర్చల్లో తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక మీడియా అధినేత కూడా పాల్గొన్నారని సమాచారం. అంతెందుకు సదరు కాంగ్రెస్ ఎమ్యెల్యే అయితే ఏకంగా… గన్‌మెన్లు లేకుండా సొంతంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి విజయవాడలో చంద్రబాబుతో రెండు రోజుల పాటు దఫదఫాలుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

అలాగే కాంగ్రెస్ కి చంద్రబాబు ఇచ్చిన జాబితాలో తనకు అత్యంత సన్నిహితులైన వ్యాపారులు, ఫిరాయింపు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. తన వారిని కాంగ్రెస్‌లోకి పంపించి పొత్తులో భాగంగా వారికి కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఇప్పించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇలా చేయడం వల్ల తన ప్రత్యర్థి అయిన వైసీపీ , బీజేపీలను ఏకకాలంలో ఎదుర్కోవడమే కాకుండా వైసీపీకి పడాల్సిన ఓట్లను చీల్చేందుకు బాబు ఈ ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది.