బాబు కి దడ పుట్టిందా ..? కుప్పంలో ఆ సర్వే అందుకేనా ..?     2018-06-13   01:05:32  IST  Bhanu C

చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా కంచుకోట అయిన చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గంలో ఇప్పుడు జరుగుతున్న ఓ రహస్య సర్వే సంచలనం రేకెత్తిస్తోంది. అత్యంత పగడ్బందీగా నిర్వహిస్తున్న ఆ సర్వే.. ఏదో పార్టీ వారో .. ఏ మీడియా ఛానెల్ వారో చేయిస్తున్నారని అందరూ సైలెంటుగానే ఉన్నారు. కానీ ఆ సర్వే చేయిస్తోంది సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అయితే ఇందులో అంతగా కంగారు పడాల్సిన అంశం ఏంటి అంటే… ప్రస్తుతం ఇక్కడ టీడీపీ పని అంత ఆశాజనకంగా లేదని తేలడంతోనే జనం నాడి తెలుసుకునేందుకే ఈ సర్వే చేయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదట్లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బలమైన ప్రత్యర్థులు, నాయకులు ఎవరూ లేని కుప్పం నియోజకవర్గాన్ని బాబు ఎంచుకున్నాడు. అప్పటి నుంచీ వరుసగా కుప్పం నుంచి గెలుస్తూ ఉన్నాడు చంద్రబాబు. అయితే 2014 ఎన్నికల్లో వైకాపా తరపున రిటైర్డ్ ఐఎఎస్ పోటీ చేయడం చంద్రబాబును భయపెట్టింది. ఎన్నికలయ్యాక కూడా ఆ ఐఎఎస్ అధికారి నిత్యం ప్రజల్లో ఉంటూ ఉండడం చంద్రబాబులో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కుప్పం నుంచి లోకేష్‌ని పోటీ చేయించి గెలిపించాలని బాబు చూస్తున్నాడు.