ఎడిటోరియల్ : బాబు ఎదురు చూపు ... బిజెపి ముందు చూపు 

చెప్పుకోవడానికి ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీలకు తీసిపోని విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.ప్రాంతీయ పార్టీలందు తెలుగుదేశం వేరయా అన్నట్టుగా ఆ పార్టీకి మంచి గుర్తింపు ఉంది.

 Bjp Ignored Chandrababus Efforts For An Alliance With The Bjp  Bjp, Tdp, Chandra-TeluguStop.com

రాజకీయ చాణక్యుడిగా చంద్రబాబు రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందారు.ప్రపంచ దేశాలలోనూ టిడిపికి మంచి ఆదరణ, ఘనమైన కీర్తి ఉంది.

చంద్రబాబు ముందు చూపుతో పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు.కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యింది.

రాజకీయంగా టిడిపిలో నిస్తేజం అలుముకుంది.ఉనికి కోసం పోరాడుతోంది.

అధికార పార్టీని ఎదుర్కునే సామర్ధ్యం తగ్గిపోవడంతో మళ్లీ బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఒకప్పుడు టిడిపి వేరు, ఇప్పటి టిడిపి వేరు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.

ఈ పరిస్థితుల్లో బిజెపి అండదండలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చినట్టు కనిపిస్తోంది.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా, టిడిపిని ముందుకు నడిపించే విషయంలో చంద్రబాబు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు.ప్రతి సందర్భంలోనూ అధికార పార్టీని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నా, ఎప్పటికప్పుడు జగన్ పై చేయి సాధిస్తూ, తిరిగి టిడిపిని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్న తీరు టిడిపి క్యాడర్ లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.రాజకీయంగాను, అన్ని రకాలుగాను, టిడిపి బాగా నష్టపోయింది.ఈ సమయంలో టిడిపి బతికి బట్ట కట్టాలంటే తప్పనిసరిగా కేంద్ర అధికార పార్టీ అండ ఉండి తీరాల్సిందే.2014 ఎన్నికల సమయంలో టిడిపి బిజెపి పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చింది.కానీ, ఆ తర్వాత పరిస్థితులను అంచనా వేయడంలో చంద్రబాబు విఫలం అవ్వడం, బిజెపి బలం తక్కువగా అంచనా వేసి, ఆ పార్టీతో వివాదం పెట్టుకోవడం వంటివి జరిగాయి.

ఆ సమయంలో బిజెపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ బాబు హడావిడి చేస్తూ వచ్చారు.

జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చక్రం తిప్పారు.అప్పట్లో బాబు వ్యవహరించిన తీరు బిజెపి పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

ఎలా అయినా, చంద్రబాబును రాజకీయంగా ఇరుకున పెట్టడంతో పాటు, అధికారం దక్కకుండా చేయాలనే అభిప్రాయంతో 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి బిజెపి పరోక్షంగా మద్దతు ఇచ్చింది.

అలాగే టిడిపి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తూ వచ్చింది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో టిడిపిని రాజకీయంగా పతనం చేసే విషయంలోనూ, వైసీపీ ప్రభుత్వానికి బిజెపి పూర్తిగా స్వేచ్చని ఇచ్చింది.బిజెపి అండదండలతో జగన్ సైతం దూకుడు వ్యవహరిస్తూ వచ్చారు.

ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో వైసీపీ ని కాస్త దూరం పెట్టి బిజెపి తటస్థంగా వ్యవహరిస్తూ వస్తోంది.ఏపీలో బలమైన పార్టీగా తయారవ్వాలంటే టిడిపిని పూర్తిగా తుడిచిపెడితేనే అది సాధ్యం అవుతుందనే అభిప్రాయానికి బిజెపి పెద్దలు వచ్చారు.

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న కరుడుగట్టిన బిజెపి వాది అయిన సోము వీర్రాజు కు ఏపీ బిజెపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.ఇక ఆయన ఆ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే, టిడిపిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు.

మీడియా డిబేట్ లలోనూ, అలాగే ఆ పార్టీ అనుకూల మీడియాలోనూ టిడిపిపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ ఇరుకున పెట్టడంలో సోము వీర్రాజు సక్సెస్ అవుతున్నారు.అలాగే బిజెపి లో ఉంటూ, టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న నాయకులపైన పూర్తిగా ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే కొంతమంది అటువంటి నేతలను గుర్తించి, పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారనే అభియోగం పై వారిని సస్పెండ్ చేయడం ద్వారా, బిజెపి లో ఉన్న బాబు భక్తులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు వంటి వారి నోర్లు మూతపడేలా చేశారు.బిజెపిలో కొనసాగాలంటే ఖచ్చితంగా పార్టీ నియమ నిబంధనలు పాటించాల్సిందేననే విషయాన్ని సోము వీర్రాజు చెప్పకనే చెప్పారు.

అలాగే టిడిపిలో ఉంటూ, రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యం లేకుండా అసంతృప్తితో ఉన్న నాయకులను ఇప్పటికే బిజెపి గుర్తించింది.అటువంటి నాయకులను నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున చేర్చుకొని, ఏపీలో టిడిపి స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది.

Telugu Ap Cm, Chandrababu, Jagan, Modhi-Telugu Political News

బిజెపి ఈ స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తూ, టిడిపిని టార్గెట్ చేసుకోవడంపై చంద్రబాబులోనూ ఆందోళన పెరిగిపోతుంది.అందుకే అవకాశం దొరికినా, దొరకకపోయినా అదే పనిగా బిజెపిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, బిజెపి అగ్రనేతలకు నిత్యం లేఖలు రాస్తూ, ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.అలాగే ఏపీ బిజెపి నేతలు టిడిపిని, చంద్రబాబును టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.వాటిపై స్పందించేందుకు చంద్రబాబు కానీ, ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణం బిజెపితో సన్నిహితంగా మెలగాలనే తపన తప్ప, ఆ పార్టీతో వివాదం పెట్టుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఇష్టపడడం లేదు.

ఒకవేళ అలా బిజెపి తో విరోధం పెట్టుకుంటే, ఆ తరువాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చంద్రబాబుకు తెలియంది కాదు.అందుకే తిట్టిన నోటితోనే పొగుడుతూ, అదేపనిగా బిజెపి పెద్దల అనుగ్రహం కోసం పాకులాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

కానీ బిజెపి నేతలు మాత్రం టిడిపి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు అనే అభిప్రాయంలోనే ఉన్నారట.బిజెపి జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఏపీ నేత ఒకరు టిడిపి విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తూ, ఏపీలో బిజెపి ఎదగకుండా చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ టిడిపి తో పొత్తు పెట్టుకుని మరోసారి తప్పు చేయకూడదు అనే అభిప్రాయంలో బిజెపి పెద్దలు ఉన్నారు.

చంద్రబాబు ఎన్ని లేఖలు రాస్తూ, ఎంతగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నా, బిజెపి మాత్రం టిడిపి విషయంలో స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.ఏపీలో టిడిపి పూర్తిగా కనుమరుగైపోతేనే బిజెపి కి అవకాశం దక్కుతుందనే అభిప్రాయంలో ఉండడంతో ఈ విధంగా బాబుని,టిడిపిని దూరం పెడుతున్నట్టు గా కనిపిస్తున్నారు.

 అయినా పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ఆపకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube