కేసీఆర్‌కు రివ‌ర్స్‌లో చంద్ర‌బాబు   Chandrababu Reverse To Kcr     2017-01-10   23:36:18  IST  Bhanu C

ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ‌దైన పాల‌న‌తో ముందుకు దూసుకుపోతున్నారు. ఇందులో సీఎం కేసీఆర్‌ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. త‌న ప‌థ‌కాల‌తో, హైటెక్ పాల‌న‌తో ఏపీని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కిస్తున్నారు చంద్ర‌బాబు. అయితే పాల‌న‌లో కేసీఆర్‌ను చంద్ర‌బాబు ఫాలో అవుతున్నారనే విమ‌ర్శ‌లు వినిపించాయి, కానీ ఒక విష‌యంలో మాత్రం కేసీఆర్‌కు పూర్తి రివ‌ర్స్‌లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

స‌చివాల‌యం.. రాష్ట్ర ప‌రిపాల‌నా యంత్రాంగం అంతా కొలువుదీరే ప్రాంతం! అయితే స‌చివాల‌యానికి రాక‌పోయినా సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్ర వ్య‌వ‌హారాల‌ను, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచే చ‌క్క‌బెట్టేస్తున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తెలంగాణ కేసీఆర్ కు భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వెల‌గ‌పూడిలో స‌చివాల‌యంలో సీఎం బ్లాక్ ప్రారంభం కాన‌ప్పుడు విజ‌య‌వాడ‌లోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచే అన్నీ నిర్వ‌హించేవారు. కానీ స‌చివాల‌యంలో సీఎం బ్లాక్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అస‌లు సీఎం క్యాంపు కార్యాలయం వైపు క‌న్నెత్తి చూడ‌ట‌మే మానేశారు. పాల‌న అంతా స‌చివాల‌యం నుంచే చ‌క్క‌బెడుతున్నారు.

క్యాంపు కార్యాల‌యం వైపు సీఎం వ‌చ్చి దాదాపు నెలరోజుల పైమాటే అయిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రే రాకపోవడంతో మంత్రులు – ఎమ్మెల్యేలు కూడా ఇటు వైపు చూడడం మానేశారు. అయితే సీఎం క్యాంపు కార్యాలయానికి నేత‌లెవ‌రూ రాక‌పోయినా.. కార్యాలయానికి అదే గస్తీ.. అదే భద్రత కొనసాగుతోంది. సుమారు 60 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఇందులో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు అధికం. అయితే ఇక్కడ మాత్రం నెలల తరబడి ఉండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు వాపోతున్నారు.

త‌మ కుటుంబ స‌భ్యులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వాపోతున్నారు. మ‌రోప‌క్క భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల‌తో క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద స్థానికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. సీఎం ఉన్న సమయంలో అయితే ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి కాని ఇపుడు తమను అనవసరంగా ఈ రూపంలో ఇరకాటం పాలు చేయడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.