ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు టిడిపి నాయకులను, క్షేత్రస్థాయి కార్యకర్తల లోనూ ఆందోళన కలిగిస్తోంది.వైసీపీ ప్రభుత్వం దూకుడుకు నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రస్తుతం అగ్ర నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండడం, వారిపై ఐటీ దాడులతో పాటు అన్ని వ్యవహారాలను ప్రభుత్వం తవ్వి తీస్తుండడంతో మరింత ఆందోళన నెలకొంది.ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహిస్తూ యాక్టివ్ గా ఉంటే తాము కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం పార్టీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
దీనికి కారణం ప్రభుత్వం తమను ఎక్కడ టార్గెట్ చేసుకుని, ఏ కేసులో ఇరికిస్తుందో అన్న భయం తెలుగుదేశం నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.మొన్నటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల అంశంతో ప్రజల్లోకి వెళ్లి ఆందోళన నిర్వహించారు.
ప్రభుత్వం ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించుకుంది.దీనికి కేంద్రం మద్దతు లభించడంతో ఆ నిర్ణయం త్వరలోనే అమలు కాబోతుంది.అయినా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఈ నెల 17 నుంచి 45 రోజుల పాటు జనచైతన్య యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు.రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క గ్రామాన్ని వదిలి పెట్టకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు బాబు పిలుపునిచ్చారు.
దీంతో పాటు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపు విమర్శలు చేస్తూ యాత్ర చేపడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు పై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.అదీకాకుండా ప్రస్తుతం గ్రామాల్లో వైసీపీ వర్సెస్ టిడిపి అన్నట్టుగా ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో, ప్రజా చైతన్య యాత్రల పేరుతో ఆందోళన నిర్వహిస్తే అనవసర కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని, పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.45 రోజులపాటు పోరాటం చేయాలంటే అది క్షేత్రస్థాయిలో సాధ్యమయ్యే పని కాదని, వారు యాత్రను వాయిదా వేయాలని కోరుతున్నారు.
కానీ చంద్రబాబు మాత్రం త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు సునాయాసంగా గట్టెక్కాలంటే, పార్టీలోనూ, ప్రజల్లోనూ కొత్త ఉత్సాహం తీసుకురావాలని, టిడిపికి మెజార్టీ స్థానాలు దక్కేలా చేయాలని చూస్తున్నారు.కానీ ఈ విషయంలో మాత్రం పార్టీ నాయకుల అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి.
అందుకే యాత్రను వాయిదా వేయించేందుకు అధినేత పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు.