టీడీపీకి ఆదరణ పెరిగిందా..? కేంద్రం నిర్ణయం కలిసిరాబోతోందా ..?     2018-06-26   04:01:23  IST  Bhanu C

తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా కేంద్రంలో ని బీజేపీ సర్కారు తీసుకుంటున్న ముందస్తు ఎన్నికల నిర్ణయం ఆ పార్టీకి కలిసొస్తుందో లేదో తెలియదు కానీ ఏపీలో టీడీపీకి మాత్రం బాగా కలిసొచ్చేటట్టుగా ఉంది. సాధారణంగానే టీడీపీకి ఏపీలో అనుకూల వాతావరణం ఉంది. దీని నిజం చేస్తూ ఇటీవల ఓ దినపత్రిక చేయించిన సర్వే కూడా మళ్ళీ టీడీపీ గెలవడం ఖాయమే అనే సంకేతాలు ఇచ్చింది.

అంతే కాదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ సుమారు 110 సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సుమారు 60 వరకు సీట్లు వస్తాయని తేలింది. ఇక జనసేన ప్రభావం కూడా అంతమతమాత్రమే అని తేలడంతో టీడీపీలో హుషారు పెరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు కేంద్రానికి ముచ్చెమటలు పట్టించాయి. ఒకరకంగా చెప్పాలంటే… అప్పటి నుంచే బీజేపీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

ఇక కేంద్రం జమిలి ఎన్నికల పేరుతో ముందస్తుకు ఎన్నికలకు వెళ్లే సూచనలు ఉండడంతో ఇక్కడ చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి పార్టీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే నవంబర్ , డిసెంబర్లోనే ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనీ, అందరూ అప్రమత్తంగా ఉండాలనీ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెబుతున్నారు.

అలాగే.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీల కుట్ర రాజకీయాల్ని బట్టబయలు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. నిజానికి.. ఇప్పుడు ఏపీలో బీజేపీ, వైసీపీ, జనసేనలు ఇరకాటంలో పడిపోయాయి. బీజేపీతో అంటకాగి.. వైసీపీ ఇంట ముందుకు వెళ్లలేకపోతోంది. మరోవైపు వైసీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

టీడీపీని దెబ్బకొట్టేందుకు బీజేపీ, వైసీపీ, జనసేనలు రహస్యంగా ఓ అవగాహనకు వచ్చినట్లు ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. ఈ మూడు పార్టీలు కూడా ప్రజల్లో క్రమంగా సానుభూతి కోల్పోతున్నాయి. మరోవైపు ఇంకా క్షేత్రస్థాయిలో ఇవి కుదురుకోలేదు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో ఆదరణ పొందుతున్నాయి. బాబు పాలనపై ప్రజలలో కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు వస్తే టీడీపీకి కలిసి వస్తుందని చంద్రబాబు ఆలోచన.