ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయి 75%... బాబువి బోగ‌స్ లెక్క‌లా.. ?       2018-04-19   02:01:55  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పాల‌న కంటే.. స‌ర్వేల ప‌రంగానే ఆయ‌న పాపులారిటీ సాధించారు. ఆయ‌న చేసిన పాల‌న కంటే.. చేయించిన స‌ర్వేలే ఎక్కువ‌గా ఉన్నాయంటే అతిశ‌యోక్తికాదు. ఇక‌, తాను ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌ల్లో ఎంత మంది ఏమ‌నుకుంటున్నారో తెలుసుకునేందుకు బాబు ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్సుక‌త చూపిస్తున్నారు. అయితే, అదేస‌మ యంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు ఎంత మందికి చేరువ అవుతున్నాయి? సామాజిక పింఛ‌న్లు ఎంత మందికి అందుతున్నాయి? ఎన్టీఆర్ ఇళ్ల ల‌బ్ధి ఎంత మందికి చేరుతోంది? అనే అనేక అంశాల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షించా ల్సి ఉన్న‌ప్ప‌టికీ.. బాబు ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు దృష్టి పెట్టిన దాఖ‌లా క‌నిపించ‌డంలేదు. కానీ, ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌లు సంతృప్తి చెందుతున్నారా? అనే అంశంపైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకోవ‌డం పైనే బాబు దృష్టి పెడుతున్నారు.

బాబు చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించి 75% మంది ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నారు. బాబు ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీనినే ప్ర‌భుత్వం భారీ స్థాయిలోప్ర‌చారం చేసుకుంటోంది. దీనిని బ‌ట్టి ప్ర‌భుత్వ పాల‌న ఎలా ఉందో అర్ధం చేసుకోవాల‌ని కోరుతోంది. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ప్ర‌భుత్వాన్నే గెలిపించాల‌ని ప‌రోక్షంగా చంద్ర‌బాబు కోరుతున్నారు. ఈ విష‌యాన్ని కొద్దిగా ప‌క్క‌కు పెట్టి.. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యాన్ని చూద్దాం. ఆయ‌న నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 1800 కిలోమీట‌ర్ల దూరం పూర్తి చేసుకుంది. రాయ‌ల‌సీమ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 7 జిల్లాల్లో పూర్తి అయింది. కృష్ణా జిల్లాలో సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు జ‌గ‌న్ చెంత‌కు క్యూక‌డుతున్నారు. ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌స్తూ.. జ‌గ‌న్‌ను విన‌తి ప‌త్రాల‌తో ముంచెత్తుతున్నారు. త‌మ‌కు పింఛ‌న్ అంద‌లేద‌ని, నిలువ నీడ‌కూడా లేద‌ని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కావ‌డం లేద‌ని, సాగునీటికి ఇబ్బంది వ‌చ్చింద‌ని,గిట్టుబాటు ధ‌ర‌లేద‌ని, తాగునీటికి ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, రోడ్డు సౌక‌ర్యం కూడా లేద‌ని, ప్ర‌భుత్వం నుంచి సాయం కూడా అంద‌డం లేద‌ని ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు ఏక‌రువు పెడుతున్నారు. నిజానికి చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయి ఉంటే.. ఇలా ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు జ‌గ‌న్ చెంత‌కు ఎందుకు ప‌రిగెడుతున్నారు?

త‌మ మొర ఆల‌కించ‌మంటూ గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల వెంట ఎందుకు ఎదురు చూస్తున్నారు? చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు, ప్ర‌చారం చేస్తున్న‌ట్టు.. ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయి నిజంగానే 75% ఉంటే.. ఇంత మంది జ‌నాలు క్యూ ఎందుకు క‌డుతున్నారో? కూడా బాబు తెలుసుకోవాలి. ఇక్క‌డ మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లాలో కూడా జ‌గ‌న్‌కు అర్జీలు వెల్లువెత్తాయంటే.. ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయి నిజంగానే ఉందో లేదో బాబు యోచించుకోవాలి!! అవ‌స‌ర‌మైతే.. జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జ‌లపైనా.. వారు చెబుతున్న ఫిర్యాదుల‌పైనా కూడా స‌ర్వే చేయిస్తే.. బాగుంటుందేమో ఆలోచించాల‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు.