టీడీపీలో లోకేష్ ప‌నైపోయిందా..చంద్ర‌బాబు న‌యా ప్లాన్‌     2016-12-30   05:25:19  IST  Bhanu C

అవును! ఇప్పుడు ఏపీలో అధికార టీడీపీ త‌మ్ముళ్లు.. ఈ మాట‌లే వ‌ల్లిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం ముద్దుల త‌న‌యుడు నారా లోకేష్‌పై వాళ్లు ఒకింత ఏవ‌గింపు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు గ‌డిచిపోతున్నా.. చిన‌బాబు పొలిటిక‌ల్‌గా ఇంకా పుంజుకోక‌పోవ‌డంపై వారు ఆగ్ర‌హంగా ఉన్నారు. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో రాష్ట్రం ఎన్నిక‌ల‌కు త‌యారు కావాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలో టీడీపీ సైకిల్‌ని భారీ ఎత్తున ప‌రుగులు పెట్టించేందుకు చిన‌బాబు త‌న వంతు కృషి చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, నిజంలో మాత్రం అలాంటి ఉరుకులు, ప‌రుగులు ఏమీ క‌నిపించ‌డం లేదు.

దీనికితోడు.. పార్టీలో అంద‌రినీ క‌లుపుకొని పోయే ధోర‌ణిలోనూ చిన‌బాబు లేక‌పోవ‌డంపై తెలుగు త‌మ్ముళ్లు తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉంటార‌ని, త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు, త‌మ స‌మ‌స్య‌లు తీర్చేందుకు చిన‌బాబు అక్క‌ర‌కొస్తాడ‌ని తెలుగు దేశంలోని కిందిస్థాయి నేత‌లు భావించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టును ఆఫ‌ర్ చేసిన స‌మ‌యంలో అంద‌రూ పొంగిపోయారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మాత్రం రివ‌ర్స్ అని వ్యాఖ్యానిస్తున్నారు.

విప‌క్ష నేత జ‌గ‌న్ కి పోటీగా.. చిన‌బాబు రాష్ట్రంలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. చాలా జిల్లాల్లో తిరిగి విద్యార్థుల‌తో మ‌మేకం అయ్యారు. అయినా కూడా ఆశించిన రిజ‌ల్ట్ రాలేదు. ఇక‌, పార్టీలో త‌న‌ను క‌ల‌వాల‌ని భావించి వ‌చ్చే కిందిస్థాయి నేత‌ల‌కు అస‌లు అపాయింట్ మెంట్‌కూడా ఇవ్వ‌డం లేద‌ట‌. కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గం లేక‌పోతే. బాగా డ‌బ్బున్నోళ్ల‌నే చేర‌దీసి వారితోనే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నార‌ని చిన‌బాబుపై అంద‌రూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిన‌బాబు బ‌దులు.. ఆ ప్లేస్‌లోకి నారావారి కోడ‌లు.. బ్రాహ్మ‌ణిని తీసుకురావాల‌ని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

చిన‌బాబులో తండ్రి చంద్ర‌బాబు మాదిరిగా క‌ష్ట‌ప‌డి పైకి వ‌ద్దామ‌నే ఆలోచ‌న లేద‌ని, ఏసీ రూంకి ప‌రిమిత‌మ‌వ్వాల‌ని కోరుకుంటున్నార‌ని అనే వ‌ర్గం కూడా ఇదే కోరుతుండ‌డం గ‌మ‌నార్హం. చిన‌బాబు స్థానంలో బ్రాహ్మ‌ణిని తీసుకురావ‌డం ద్వారా దివంగ‌త ఎన్‌టీఆర్‌ను మ‌రిపించే నేత టీడీపీలోకి వ‌చ్చిన‌ట్టు అవుతుంద‌ని, ఇది త‌మ‌కు పార్టీకి కూడా మేలు చేస్తుంద‌ని వారు అంటున్నారు.ఈ క్ర‌మంలోనే చిన‌బాబు ప్టేస్‌లో బ్రాహ్మ‌ణి ఎంట్రీ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. అయితే, అదే స‌మ‌యంలో టీడీపీ కి రివ‌ర్స్‌గా జూనియ‌ర్ ఎన్‌టీఆర్ వ‌స్తే.. ఏంట‌ని చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. మొత్తానికి ఇప్పుడు ఈ విష‌యంపై ఏపీలో తీవ్ర చ‌ర్చ సాగుతోంది.