ఎంతపని చేసావ్ బాబు ! నీ నిదానమే కొంప ముంచుతోందా ..?   Chandrababu Negligence Over Other Party Leaders     2018-07-10   23:42:20  IST  Bhanu C

ఎన్నికల సమయం దగ్గరకు వస్తోంది కదా నాయకుల చేరికలు , అలకలు, వీడ్కోలు అన్నీ సహజంగానే జరిగిపోతుంటాయి. ఏ పార్టీలో నాయకులకు బెటర్ పొజిషన్ ఉంటుందో అక్కడకి క్యూ కట్టేస్తుంటారు. అయితే పార్టీలు మాత్రం ఎవరి వల్ల అయితే పార్టీకి కలిసి వస్తుందో.. ఎవరి వల్ల నష్టం వస్తుందో అనే విషయాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని మరీ ముందుకు వెళ్తుంటాయి. పక్క పార్టీలో బలమైన నాయకులు వస్తే పార్టీకి కలిసి వస్తుందని భావించినా వారిని లాక్కునేందుకు కూడా పార్టీలు వెనుకడుగు వేయవు. ఎందుకంటే ఎన్నికల సమయంలో గెలుపే ప్రధానం ప్రతి పార్టీకి.

అధికార పార్టీ టీడీపీ వేస్తున్న కొన్ని తప్పటడుగులు ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీకి బాగా కలిసి వస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్న నేతల విషయంలోనూ, పార్టీలో అసంతృప్తిగా ఉంటున్నవారిని వెంటనే బుజ్జగించడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.ఈ విషయంలోవైసీపీ కాస్త చురుగ్గానే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. వాస్తవానికి వైసీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలను టీడీపీ ఆకర్షించి, చేర్చుకుంది. కానీ, నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం కనిపించకపోవడంతో చేరికలకు చంద్రబాబు బ్రేక్ వేశారు. అయితే, అదే కారణంతో కొంతమంది కీలక నేతల్నికూడా బాబు దూరం చేసుకోవడం టీడీపీకి ఇప్పుడు పెద్ద వీక్ పాయింట్ గా మారింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పదవి చేపట్టకముందు టీడీపీలో చేరేందుకే ఉత్సాహం చూపించాడు. ఆ సమయంలో టీడీపీ మరింత చురుగ్గా వ్యవహరించి ఉంటే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేవారని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే, విశాఖకు చెందిన ఓ సీనియర్ నాయకుడు కూడా టీడీపీవైపే కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నా. ఎటూ తేల్చకపోవడంతో ఇప్పుడు ఆయన వేరే పార్టీలో చేరేందుకు చూస్తున్నారు.

ఇక నెల్లూరు కి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి విషయంలోనూ టీడీపీ కాస్త ముందుగా స్పందించి ఉంటే ఆయన ఆ పార్టీలోనే ఉండేవారనీ, ఆయన అసంతృప్తిని మొదట్లో సీరియస్ గా తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి టీడీపీలో చేరికపై చాలాకాలం కిందటే కథనాలు వచ్చాయి. ఆయన కూడా సిద్ధంగా ఉన్నా.. టీడీపీ అధినాయకత్వం నుంచి సరైన సమాచారం ఆయనకి లేదట! మధ్యలో వైసీపీ కూడా ఆయన్ని ఆహ్వానించినా. చేరేందుకు ఇష్టపడక మౌనంగా ఉండిపోయారట. ఇలా పార్టీలోకి వస్తామంటున్న బలమైన నేతల విషయంలో టీడీపీ తప్పటడుగులు వేస్తుండగా వాటినే వైసీపీ తన బలంగా మార్చుకుంటోంది. అంటే వైసీపీ బలం పుంజుకోవడానికి పరోక్షంగా టీడీపీనే కారణం అవుతోంది.