బాబు కి తలనొప్పిగా చినబాబు ..లోకేష్ ఎక్కడా గెలవలేడా....     2018-09-17   15:15:30  IST  Sai M

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని గనిగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి ! అంటే.. తండ్రికి కొడుకు పుట్టగానే సంతోషం కలగదు … ఆ కుమారుడుని చూసి ప్రజలు మెచ్చిన రోజునే సంతోషము కలుగును. ఈ పద్యంలో ఉన్నట్టే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మనసులో కూడా ఈ విధమైన ఆలోచన ఆయన్ను కుదురుంచడంలేదు. ఆంధ్రరిని రాజకీయంగా విమర్శించే బాబు లోకేష్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దొడ్డి దారిలో మంత్రి అయ్యాడు అంటూ విపక్షాలు లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అవన్నీ నేరుగా చంద్రబాబుకి గుచ్చుకుంటున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని ప్రత్యక్ష ఎన్నికల్లో దింపాలని బాబు చూస్తున్నాడు. అందుకోసం టీడీపీ కంచుకోటాల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.

లోకేష్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. కానీ చంద్రబాబుకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. అందుకే లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అన్న విషయంపై సర్వేలు చేయిస్తున్నాడు. ఈ సర్వేలలో బాబు అనుకూల మీడియా అధినేత కూడా పాల్పంచుకుంటున్నాడు. హిందూపురం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని సర్వే చేశారు. అయితే హిందూపురం నుంచి ఈ సారి బాలకృష్ణ గెలుపు కూడా కష్టమే అని తేలిందట. దీంతో ఆ నియోజకవర్గాన్ని పక్కనపెట్టేశారు. పోనీ కుప్పంలో లోకేష్ ని పోటీ చేయిద్దామంటే బాబు సీటు మారేందుకు ఇష్టపడడంలేదు.

కృష్ణా, గుంటూరు జిల్లాలు చూద్దామంటే రాజధాని నిర్మాణం ప్రభావంతో భూములు కోల్పోయిన రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో స్పష్టంగా తెలియని పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ అనుకున్నారు. ఫైనల్‌గా చంద్రబాబు సొంత ఊరు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచించి అక్కడ సర్వే చేశారు. ఆ సర్వేలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. అయితే మొత్తం విశ్లేషణను శ్రద్ధగా విన్న చంద్రబాబు ఆ తర్వాత మాత్రం చంద్రగిరి నుంచి లోకేష్ పోటీ చేయాలన్న విషయంపై ఆ ప్రతిపాదన తెచ్చిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసాడట.

స్వయంగా తాను పోటీ చేస్తేనే ఘోరంగా ఓడించిన ప్రజలు తన కొడుకును ఎందుకు ఆదరిస్తారని పులివెందులలో వైఎస్‌లు, సిద్ధిపేటలో హరీష్‌రావులకు ఉన్న స్థాయిలో ప్రజల్లో గ్రిప్ తెచ్చుకోవడం అంత ఆషామాషీ విషయం కాదని విశ్లేషించాడట చంద్రబాబు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే నియోజకవర్గం చూడండి….అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దు, ఆశలు పెట్టుకోవద్దు అని తన కోటరీకి ఆదేశాలు జారీ చేశాడట. దీంతో ఏపీలో ఎక్కడెక్కడ బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో గెలుపు ధీమా ఉన్న నియోజకవర్గాలు ఏవి అనే వెతుకులాటలో పడ్డారు.