ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఏపీ సీఎం..? బుక్కయినట్టేనా ...?       2018-06-05   01:19:25  IST  Bhanu C

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి మరో కేసు పీకకు చుట్టుకుంది. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం లేకపోవడం… ఏ కేసులో బాబు దొరుకుతాడా అని కేంద్రం డేగ కళ్ళతో చూస్తుండడంతో ఇక చంద్రబాబు ఇరుక్కున్నట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ ఫ్లయింగ్‌ లైసెన్స్‌ను తీసుకున్నారనే ఆరోపణల కింద ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌పై కొద్దిరోజుల క్రితం సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, బెంగళూరులోని ఆరు కేంద్రాలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ లైసెన్స్‌లు పొందే విషయంలో 5/20 నిబంధలను కంపెనీ ఉల్లంఘించినట్లు సీబీఐ ఆరోపించింది.

ఎయిర్‌ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్‌ జెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమాన యాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా, విస్తారా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రయోజనం జరిగింది.

ఈ వ్యవహారమంతా హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగినట్లు కొన్ని సాక్షాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి.ఈ ఆడియో టేపులకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ రాయబేరం కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీని రంగంలోకి దింపడానికి ఎయిర్‌ ఏషియా హైదరాబాద్‌ నోవాటెల్‌లో సమావేశమైనట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 21, 2015లో హైదరాబాద్‌లో జరిగిన 11వ ఎయిర్‌ ఏషియా ఇండియా బోర్డు మీటింగ్‌లో సింగపూర్‌కు చెందిన ‘హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ పీటీఈ’ ని లాబీ కోసం నియమిస్తూ తీసుకున్న కాపీని మనీ కంట్రోల్‌ వెబ్‌సైట్‌ వెలుగులోకి తీసుకొచ్చింది.

ఈ టేపుల్లో ఎయిర్‌ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌ స్థానికంగా ఉన్న వ్యక్తిని రాయబేరాలకు తీసుకోమనడం.. హైదరాబాద్‌ కేంద్రంగా బోర్డు సమావేశంలో హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడెండ్‌ కు చెందిన రాజేంద్ర దూబేకు బాధ్యతలు అప్పచెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అప్పటికి ఓటుకు నోటు కేసు కు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి రాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్‌ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. మలేషియా ఎయిర్‌లైన్స్‌ కంపెనీతో బేరసారాల కోసం ఒక సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

సీబీఐకు ఎయిర్‌ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌, ఎయిర్‌ ఏషియా (ఇండియా) సీఈవో మిత్తూ శాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్‌ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్‌ సిఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని టోనీ ఫెర్నాండెజ్‌, మిత్తూ శాండిల్యాల మధ్య సంభాషణలు ల ద్వారా అర్ధమౌతుంది.

‘చంద్రబాబును పట్టుకుంటే కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలుదారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్‌ గజపతి రాజే చెప్పారు.’ అని ఆడియో టేపులో శాండిల్య మాట్లాడారు. ఈ కేసు ఇప్పుడు బీజేపీకి ఒక అస్త్రంగా దొరికినట్టే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ని ఇరుకునపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.