ఇరుకునపెడుతున్న వివాదాలు ... ఇరుక్కుపోతున్న బాబు       2018-07-03   00:09:24  IST  Bhanu C

గత కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు కి ప్రశాంతత కరువయ్యింది. టీడీపీ నాయకుల అత్యుత్సహం వల్ల పార్టీ పరువు ప్రజల్లో పోతోంది. నాయకుల అడ్డు అదుపు లేని నోటి దురద కారణంగా చంద్రబాబు దోషిగా నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న ఈ సమయంలో ప్రతిపక్షాలను ఇరుకున పెట్డాలనుకుంటే టీడీపీనే ఇరుక్కుపోతోంది. ఒకటి కాదు రెండు కాదు వరుస వరుసగా ఒకదాని వెంట మరొకటి అన్నట్టుగా ఏదో ఒక వివాదం చెలరేగి బాబు తలా బొప్పికట్టేలా చేస్తున్నాయి.

కొద్దిరోజుల క్రితం నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినపుడు, ఆనందంగా ప్రధాని మోదీతో కరచాలనం చేసిన బాబు ఫొటోలు బయటకు వచ్చాయి. మీడియా ప్రతినిధులు తీశారా లేక బిజెపి నేతలే విడుదల చేశారోగానీ ఈ ఫొటోలు దుమారం రేపాయి. అమరావతిలో యుద్ధం ఢిల్లీలో స్నేహమా అంటూ ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. ఆ తరువాత నాయి బ్రాహ్మణుల వివాదం బాబు మెడకు చుట్టుకుంది. తమ సమస్య పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చిన క్షురకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ బాబు వ్యవహరించిన తీరుతో బీసీలు గుర్రుగా ఉన్నారు.

మొన్న శ్రీకాకుళంలో ఏరువాక నిర్వహించిన బాబు పొడి నేలపై నాట్లు వేసి ప్రతిపక్షాలకు , సోషల్ మీడియాలో యాంటీ టీడీపీ అకౌంట్లకు దొరికేసాడు. దాని మీద వచ్చిన కౌంటర్ లు అన్ని ఇన్ని కాదు. నీళ్లు లేకుండా వారి నాట్లు వేసే పద్ధతి కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్త బాబు అంటూ ఆడేసుకున్నారు. అలాగే.. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సిఎం రమేష్ నిరాహార దీక్ష చేస్తుండగా ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు వ్యంగ్యంగా మాట్లాడడంతో దీక్ష చేసిన క్రెడిట్ కంటే భారీ స్థాయిలో పరువు పోయింది. ముఖ్యంగా ఎంపీ మురళీ మోహన్ మాట్లాడిన మాటలు బాగా డ్యామేజ్ చేశాయి. ఐదు కేజీలు తగ్గడానికి నేను వారం రోజులు దీక్ష చేస్తా అంటూ జోక్‌లు వేసుకోవడం టీడీపీ నాటకాలాడుతోంది అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఏదో ఒక వివాదం వస్తూనే బాబు మెడకు చుట్టుకుంటున్నాయి.