అక్కడ అలా.. ఇక్కడ ఇలా ! బాబు మార్క్ రాజకీయం ఏంటో...?     2018-12-06   16:00:44  IST  Sai M

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా… చివరికి అన్నిఆయనకు కలిసొచ్చేలా మాత్రం ఫైనల్ రిజల్ట్ ఉంటాయి. అవును బాబు రాజకీయం అంటే అలాగే ఉంటుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడం… మహాకూటమి లో వివిధ పార్టీలను చేర్చడం … సీట్ల సర్దుబాటు చేయడం … ఇలా ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా అన్నీ… అంతిమంగా టీడీపీకి అనుకూలంగానే ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎదుర్కుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇక్కడ ఇంత బాధ్యత తలకెత్తుకున్న చంద్రబాబు దృష్టి మాత్రం ఎప్పుడూ జాతీయ రాజకీయాల మీదే తిరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి తిరుగులేని నాయకుడిగా ఎదగాలని బాబు భావిస్తున్నాడు.

Chandrababu Naidu Campaign In Telangana-Chandrababu Campaigning Telangana KCR Mahakutami Praja Front Prajakutami TDP TRS

కేసీఆర్ ను ఓడించడం, ఫామ్ హౌస్‌కు పంపించడం కన్నా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం బాబుకి అత్యవసరం. అందుకే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని పదే పదే చెబుతున్న చంద్రబాబు.. తెలంగాణాలో ప్రజాకూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తన హవాను 2019లోనూ కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సమయంలో ఇప్పుడు ఏపీ రాజకీయాల విషయం లో బాబు ఏం చేస్తాడు అనేది అందరికి పెద్ద సందేహం కలుగుతోంది. అదే సమయంలో అటు కేసీఆర్‌పైనా.. ఇటు 2014లో తన పార్టీ టికెట్‌పై గెలిచి.. తర్వాత పార్టీ మారి కేసీఆర్ చెంతకు చేరిపోయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారిపైనా బాబు విరుచుకుపడుతున్నారు. పార్టీలు మారిన వారిని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు.

Chandrababu Naidu Campaign In Telangana-Chandrababu Campaigning Telangana KCR Mahakutami Praja Front Prajakutami TDP TRS

ఇక ఏపీలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు కూడా చంద్రబాబు ఇంత పారదర్శకంగా, ఇదే రీతిలో ప్రజలకు పిలుపు ఇస్తారా ? ఇలానే పార్టీలు మారిన వారిని ఓడించండి, తగిన విధంగా బుద్ధి చెప్పండి, పార్టీలు మారేలా ప్రోత్సహించిన పార్టీలను ఫామ్ హౌస్‌కు పంపండి అని ప్రచారం చేయగలరా అనే విషయం మీద సోషల్ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు వేస్తున్నారు నెటిజెన్లు. ఏపీలో అధికార పార్టీగా టీడీపీకి అవసరమైన బలం ఉంది. అయినా కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను విడతల వారీగా 23 మందిని తన పార్టీలోకి చేర్చుకున్నారు. వారిలో కొందరికి పదవులు కూడా ఇచ్చారు. దీనిని చంద్రబాబు చాలా సార్లు సమర్ధించుకున్నారు. ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్‌.. తన ప్రభుత్వానికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలోనే తాను ప్రోత్సహించానని అన్నారు. అంటే.. ఏపీలో విపక్ష టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం సరైందనేనని సమర్ధించుకోవడంలో బాబు సక్సెస్ అయ్యారు. కానీ, ఇదే విషయంలో తెలంగాణాలో కేసీఆర్ వ్యవహరించిన తీరు బాబు కు ఇప్పుడు తప్పుగా కనిపిస్తోంది. దీనిపైనే అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.