రాష్ట్ర రాజకీయాలకు బాబు, కేసీఆర్ గుడ్ బాయ్ ..రీజన్ ఇదే       2018-07-06   01:49:11  IST  Bhanu C

కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి రావచ్చు. ఇక రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఎవరి చేతిలో ఎప్పుడు అధికారం ఉంటుందో ఎవరూ చెప్పలేము. నిన్నటి వరకు ఒక పదవిలో ఉన్నవారు అకస్మాత్తుగా దిగిపోవాల్సి వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయం అంటేనే జూదం.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే… ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఈ సారి జాతీయ రాజకీయాలవైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి ఢిల్లీ రాజకీయాలు చక్కబెట్టాలని చూస్తున్నారు. దీనికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి.

ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే.. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఆందోళనకరంగానే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుక అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అనే ఆందోళన బాబు లో ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి హోదాలో కూర్చుంటే ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి చంద్రబాబుకు మనసు ఒప్పకపోవచ్చు. ఎందుకంటే జగన్ తండ్రి సీఎంగా కూర్చున్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇప్పుడు జగన్ సీఎం సీట్లో కూర్చుంటే చంద్రబాబు ప్రతిపక్ష సీట్లో కూర్చోలేడు. అది ఆయనకు పెద్ద నామోషిగానే ఉండవచ్చు. ఈ కారణాలతోనే ఎంపీగా వెళ్లేందుకు బాబు మొగ్గుచూపుతున్నాడని తెలుస్తోంది. ఒక వేళ టీడీపీ అధికారంలోకి వస్తే వయసు రీత్యా కూడా ఆ పదవి లోకేష్ కి అప్పజెప్పి తాను మిగతా వ్యవహారాలు చూసుకుంటే బెటర్ అన్న ధోరణి బాబులో కనిపిస్తోంది.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన సాధారణంగానే ప్రతిసారి ఎమ్యెల్యే, ఏపీ స్థానాలకు పోటీ చేస్తూ ఉంటాడు. వచ్చేసారి కూడా అదే జరగబోతోందని సమాచారం. అయితే వచ్చేసారి తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా కేసీఆర్ ఎమ్మెల్యే హోదాలో ఉండడనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే తనయుడిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలనేది కేసీఆర్ ప్లాను. ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకపోతే జాతీయ రాజకీయాల వైపు వెళ్లడమే బెటర్ అని కేసీఆర్ ఆలోచన. ఇద్దరు చంద్రులు ఒకేసరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఒకే విధంగా జాతీయ రాజకీయాలవైపు మళ్లాలని చూస్తుండడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.