సింగపూర్ అంటే బాబు కి ఎందుకంత మోజు ..?       2018-06-12   01:06:30  IST  Bhanu C

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మాట్లాడితే చాలు సింగపూర్ ప్రస్తావన తెస్తుంటారు. ఏపీని సింగపూర్ చేస్తా.. అంటూ ఆ దేశ నామం నిత్యం జపిస్తుంటాడు. మొదటి నుంచి సింగపూర్ తో బాబు కి ఏదో తెలియని అనుబంధం అయితే ఉంది. అది ఎలాంటిది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇక సింగపూర్ ప్రభుత్వం కూడా బాబు కి అదే స్థాయిలో ఎర్ర తివాచి పరుస్తుంటారు. ఇక ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సింగపూర్ పేరు బాబు నోట బాగా వినిపిస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. సింగపూర్ తో ఒప్పందాలు అంటూ చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని ఆ దేశానికి రాసిస్తున్నాడనే అనే వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. ఎంత దారుణం అంటే.. కేవలం మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూ సింగపూర్ సంస్థలు ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలపై స్థాయి విలువైన భూమిని సొంతం చేసుకుంటున్నాయంటే బాబు గారు ప్రభుత్వం వారికి ఏమేరకు లబ్ది చేకూర్చుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

అమరావతి డెవలప్ మెంట్ విషయంలో సింగపూర్ పెట్టే పెట్టుబడులు మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే. అయితే ఏపీ ప్రభుత్వం దీని కోసం ఏకంగా 6,700 కోట్ల రూపాయల విలువైన భూములను అప్పగిస్తోందని సమాచారం. ఈ భూముల విలువ ఇంతే కాదు..భవిష్యత్తులో మరింత పెరగవచ్చు. ఈ విధంగా సింగపూర్ కంపెనీలు భారీగా లాభపడనున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఈ ఒప్పందాల్లో చంద్రబాబుకు చీకటి లాభాలు ఉండవచ్చనే అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. సింగపూర్ ప్రభుత్వానికి ఈ భూములు కేటాయించడమే పెద్ద స్కామ్ అని, చీకటి ఒప్పందాలు జరిగి ఉండవచ్చు అని ప్రతిపక్షాలు కూడా గొంతు చించుకుని మరీ చెప్తున్నాయి. అంతే కాకుండా సింగపూర్ కంపెనీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక రహస్య జీవోలు విడుదల చేస్తూ… వారికి మేలు చేకూర్చుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీని సింగపూర్ చేయడం మాట అలా ఉంచితే.. సింగపూర్ కి ఏపీని తాకట్టు పెట్టకపోతే చాలు అనే వ్యంగ్య వ్యాక్యానాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.