గత కొంత కాలంగా ఏపీ తెలుగు యువత అధ్యక్షుడిగా పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ ఎంపిక అవుతారని ఒక్కటే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ ఈ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏడాదిన్నరనుంచి ఖాళీ గా ఉంది.
వాస్తవానికి గత ఎన్నికలకు ముందే చంద్రబాబు మూడేళ్ల పాటు ఊరించి ఊరించిన తర్వాత అవినాష్‌కు ఈ పదవి కట్టబెట్టారు.ఎన్నికల చివర్లో అవినాష్‌కు గుడివాడ సీటు ఇవ్వగా ఆయన కొడాలి నానిపై పోటీ చేసి భారీగా ఖర్చు చేసి ఓడిపోయారు.
చివరకు ఎన్నికల తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ చేసేశారు.అప్పటి నుంచి తెలుగు యువత పదవి ఖాళీగానే ఉంది.ఈ క్రమంలోనే ఈ పదవి కోసం పలువురు నేతల పేర్లు వినిపించినా ప్రధానంగా పరిటాల రవి వారసుడు శ్రీరామ్ అయితేనే ఈ పదవికి కరెక్ట్ అని ఎక్కువ మంది పార్టీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు శ్రీరామ్ పేరే సూచించారు.

అయితే తాజాగా శ్రీరామ్‌కు అదిరిపోయే షాక్ తగిలింది.చంద్రబాబు అనూహ్యంగా ఆయనను పక్కన పెట్టారు.చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు చెందిన బీసీ నేత జి.శ్రీరామ్ కు ఈ బాధ్యతలను అప్పగించారు.తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా జి.శ్రీరామ్ ను నియమిస్తూ పార్టీ ప్రకటన జారీ చేసింది.శ్రీరామ్ గతంలో పార్టీలో పదవులు చేపట్టారు.
ప్రతిష్టాత్మకమైన మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు.చేనేత వర్గానికి చెందిన శ్రీరామ్ ను ఈ పదవికి ఎంపిక చేయడం విశేషం.
శ్రీరామ్‌కు పదవి ఇచ్చే విషయంలో లోకేష్‌కే ఇష్టం లేదని కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.పరిటాలకు చెక్ పెట్టేందుకే వ్యూహాత్మకంగా బీసీ కోటాను తెరమీదకు తెచ్చి జీ శ్రీరామ్‌కు ఈ పదవి కట్టబెట్టారని అంటున్నారు.
ఏదేమైనా పరిటాలను ఊరించి ఊరించి చివరకు ఉసూరుమనిపించేశారు.ఇక పరిటాలకు ఉన్న ఆప్షన్ అల్లా రాప్తాడు, ధర్మవరం రెండు అసెంబ్లీ సీట్లు తీసుకోవడం మినహా ఏం లేదు.
అయితే ఈ రెండు చోట్లా ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది.