చంద్ర‌బాబు దెబ్బ‌తో ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్ క్లోజేనా..!       2018-04-30   23:29:21  IST  Bhanu C

గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు! మాట‌ల తూటాల‌తో విప‌క్షాల‌పై విరుచుకుప‌డి, త‌న‌దైన శైలితో విప‌క్షాల‌ను ఇరుకున‌పెట్టేనేత‌గా గుర్తింపు పొందారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ హ‌యాం నుంచి టీడీపీలోనే ఉండి(మ‌ధ్య‌లో ఓసారి కాంగ్రెస్‌లోకి వెళ్లినా.. మ‌ళ్లీ సైకిల్ ఎక్కేశారు) పార్టీ అధినేత‌ల‌కు త‌ల‌లో నాలుక‌లా క‌లిసిపోయిన నేత‌. రాజ‌కీయ వ్యూహ చ‌తుర‌త‌లో, విప‌క్షాల‌ను సైతం త‌న దారిలో తెచ్చుకోగ‌ల నేర్పులో గాలి ముద్దుకృష్ణ‌కు పెట్టింది పేరు. అందుకే ఆయ‌న ఎమ్మెల్సీగా బ‌రిలో దిగిన‌ప్పుడు విప‌క్షం వైసీపీ ఆయ‌న‌పై పోటీ పెట్ట‌లేదు. చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గాలి.. భౌతికంగా ఇప్పుడు రాజ‌కీయాలకు దూర‌మ‌య్యారు.

అయితే, ప్ర‌స్తుతం అంతా వార‌సుల హ‌వా న‌డుస్తున్న నేప‌థ్యంలో గాలి త‌న‌యులు భాను ప్ర‌కాశ్‌, జ‌గ‌దీష్‌లు కూడా త‌మ తండ్రి బాట‌లో రాజ‌కీయాల్లోకి రావాల‌ని భావించారు. అయితే, గాలి జీవించి ఉండ‌గా.. త‌న కుమారుడు భానును మాత్ర‌మే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిచ‌యం చేశారు. ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు ఎలా ఉంటాయో ప్ర‌త్య‌క్షంగా చూపించారు.
అంతేకాదు, త‌న స్నేహితులు, స‌న్నిహితుల వ‌ద్ద‌.. గాలి త‌న రాజ‌కీయ వార‌సుడిగా భానునే ప‌రిచ‌యం చేశారు. దీంతో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు భానుకే ఫోన్లు చేస్తుంటారు.

ఇక‌, ఇప్పుడు గాలి లేరు. దీంతో రాజ‌కీయంగా ఈ కుటుంబంలో ప‌ద‌వుల కోసం రోడ్డెక్క‌కే ప‌రిస్థితి వ‌చ్చింది. గాలి ఎమ్మెల్సీ ని త‌న‌కు కావాలంటే త‌న‌కు కావాలని ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యులు టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్దే గొడ‌వ ప‌డ్డారు. దీంతో వీరిని ప‌క్క‌కు త‌ప్పించిన అధినేత గాలి భార్య స‌ర‌స్వ‌తమ్మ‌కు ఆ టికెట్ ఖ‌రారు చేశారు. ఇక‌, దీంతో ఈ ఇద్ద‌రు సోద రులు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ధీమా పెట్టుకున్నారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఇప్ప‌డు ప్లేట్ తిర‌గ‌బ‌డింది. వీరి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ.. తాజాగా చంద్ర‌బాబు వీరిద్ద‌రికీ ఈ నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదే జిల్లాకు చెందిన ప్ర‌స్తుత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం జేఈవో.. శ్రీనివాస‌రాజును రాజ‌కీయాల్లోకి తెచ్చి.. ఆయ‌న‌కు న‌గ‌రి టికెట్‌ను ఇస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. నియోజకవర్గంలో రాజులు, బీసీలు, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు..అధికంగా ఉన్నారు. వీరంతా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా జ‌బ‌ర్ద‌స్త్ రోజా దూకుడుకు క‌ళ్లెం వేయాల‌ని కూడా ఇక్క‌డి వారు తీర్మానించుకున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో రోజా ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే ఓడించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఇక్క‌డ రోజాను ఓడించ‌డం అంత సులువు కాదు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు.. రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేని గాలి త‌న‌యుల‌ను రంగంలోకి దింప‌డం కంటే.. విద్యావంతుడు, ఆర్థికంగా బ‌లంగా ఉన్న జేఈవో శ్రీనివాస‌రాజును రంగంలోకి దింపుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గాలి వార‌సుల ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు. అదే శ్రీనివాస‌రాజు ఆర్థికంగా కూడా చాలా బ‌లంగా ఉన్నాడు. ఇదే జ‌రిగి.. శ్రీనివాస‌రాజు రంగంలోకి దిగితే.. ఇక్క‌డి సీటుపై ఆశ‌లు పెట్టుకున్న గాలి త‌న‌యుల‌కు రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్ క్లోజ్ అయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.