బాబు గారి పిల్లి మొగ్గ‌ల క‌థ ఇదే...   Chandrababu Gari Pilli Moggalu Katha Edhe     2018-04-09   02:32:37  IST  Bhanu C

ఏపీలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఎవ‌రిదారిలో వారు.. ఎవ‌రికివారుగా ఉద్య‌మిస్తున్నారు. ఇందులో సీఎం చంద్ర‌బాబుది మాత్రం ప్రత్యేక పంథా.. ఆయ‌న ఎవ‌రితోనూ క‌లవ‌రు.. అంద‌రూ ఆయ‌న‌తోనే క‌ల‌వాలి.. ఆయ‌న నాయ‌క‌త్వంలోనే ఉద్య‌మించాలి.. ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేదు…ప్ర‌త్యేక ప్యాకేజీ చాలని అనేక సార్లు చెప్పిన బాబుగారు ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో ఇంటికొక్క‌రు పాల్గొనాల‌ని అఖిల ప‌క్షం స‌మావేశం వేదిక‌గా పిలుపునిచ్చారు.


ఇక్క‌డివ‌ర‌కు బాగానే ఉన్నా.. అస‌లు అఖ‌లిప‌క్షం అంటే అన్నిపార్టీలు ఉండాలి.. అధికార‌, విప‌క్ష‌, వామ‌ప‌క్షాల‌తోపాటు, ప్ర‌జా, ఉద్యోగ‌, విద్యార్థి సంఘాలూ ఉండాలి. కానీ బాబుగారు స‌చివాల‌యంలో నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పాల్గొన్న‌ది ఎవ‌రో కూడా అర్థంకాని ప‌రిస్థితి. అన్నిపార్టీలు క‌లిసిరాకుండానే అఖిల‌ప‌క్షం అని పేరుపెట్టి ఇంటికొక్క‌రు ఉద్య‌మంలో పాల్గొనాల‌ని చంద్ర‌బాబు పిలుపునివ్వ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు హాజ‌రు కాలేదు.

నిజానికి తాము అఖిల‌ప‌క్ష స‌మావేశానికి రామ‌ని ఆయా పార్టీల నేత‌లు తేల్చి చెప్పారు. అయితే ఏపీలో కీల‌క పార్టీలు, సంఘాల రాకుండా బాబుగారు ఎవ‌రితో స‌మావేశం నిర్వ‌హించార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ వైపు ఢిల్లీలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగారు. వారికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ఇక వామ‌ప‌క్షాలతో క‌లిసి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గా విజ‌య‌వాడ‌లో పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇక బాబుగారు సైకిల్ యాత్ర‌తో స‌రిపెట్టారు.

అయితే ఒక్క‌విష‌యంలో మాత్రం ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం రెండు క‌మిటీలు వేశారు. ఒక‌టేమో స‌మ‌న్వ‌య క‌మిటీ, ఇంకోటి కార్య నిర్వ‌హ‌ణ క‌మిటీ. ఏపీలో ఎవ‌రి పంథాలో వారు ఉద్య‌మం చేసినా ప్ర‌భుత్వప‌రంగా స‌హ‌క‌రిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పి అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ముగించారు. ఏదేమైనా ఒక్క‌టి మాత్రం క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. ఏపీకి హోదా విషయంలో బాబు అడ్డ‌దిడ్డంగా అడుగులు వేస్తూ… ఎన్ని ప్లాన్లు వేస్తున్నా అవి ఫెయిల్ అవుతున్నాయి. కేవ‌లం త‌మ పార్టీకే క్రెడిట్ వ‌చ్చేందుకు ఆయ‌న ఆడుతోన్న గేమ్ రిజ‌ల్ట్ ఇవ్వ‌డం లేదు.