బాబు వస్తున్నాడు ... పార్టీ ప్రక్షాళన మొదలుపెడుతున్నాడు       2018-07-08   00:23:31  IST  Bhanu C

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తన సమయం అంతా పార్టీకే కేటాయించాలని చూస్తున్నాడు. అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశాల్లో ఈ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ‘రోజువారీ పాలనా కార్యక్రమాల బాధ్యత ఇక మీరే చూసుకోవాలి. పోలవరం, రాజధాని నిర్మాణం వంటి ఒకటి, రెండు అంశాలు మాత్రమే నేను పర్యవేక్షిస్తా’ అని ఆయన చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాబు నిర్ణయం కారణంగా ఇక పాలనా భారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైనే పడబోతోంది.

దేశం లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉండటంతో పార్టీ ప్రక్షాళన చేపట్టాలని బాబు ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్రం లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. వైసీపీ, జనసేన పార్టీలు జనాల మద్దతు పొందేందుకు యాత్రలపేరుతో దూసుకుపోతున్నారు. అదే సమయంలో టీడీపీ పై తీవ్ర స్థాయిలో వారు విరుచుకుపడిపోతున్నారు. దీనికి బీజేపీ కూడా తోడవ్వడంతో టీడీపీ ఒంటరి అయిపోయింది. ఈ పరిస్థితి క్షేత్రస్థాయిలో కార్యకర్తలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న అభిప్రాయం టిడిపి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

మరోవైపు అంతర్గతంగా చేయించుకుంటున్న సర్వేల్లోనూ, కిందిస్థాయి నుండి వస్తున్న సమాచారం ప్రకారం టిడిపిపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోందని సమాచారం వస్తుండడంతో బాబు ఆలోచనలో పడ్డాడు. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పి కొట్టడంలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు విఫలమవుతున్నారని, స్థానిక నేతల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టడంతో పాటు, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని, నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలను మరింత ముమ్మరం చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రతిపక్షాల బలహీనతలను గుర్తించి దాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చుకుని లబ్ధిపొందాలనే ఆలోచనలో బాబు ఉన్నాడు.