బాబు మారలేదు.. అప్పుడు నడిపించాడు ... ఇప్పుడు నటిస్తున్నాడు !       2018-06-15   04:27:00  IST  Bhanu C

ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు..? ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది ! అన్ని రాష్ట్రాలకంటే ఏపీ కే కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చింది ! హోదా అంటే జైలుకే ..! ఇవన్నీ ఒకప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలే. కట్ చేస్తే… ఏపీ కి బీజేపీ తీరని అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి మోసం చేశారు. నిధులు ఇవ్వకుండా ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ… చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నది. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన బాబు అప్పుడు బీజేపీ ప్రతిపాదనలు అన్నిటికి ఒకే చెప్పి బీజేపీతో కటీఫ్ చెప్పేసాక బీజేపీ మోసం చేస్తుందంటూ రెండు నాలుకల ధోరణిలో మాట్లాడుతున్నాడు.

బీజేపీ విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు, ప్రతి విషయంలోనూ రెండు రకాలుగా ప్రవర్తిస్తున్న విధానం ఇప్పుడు బయటపడుతోంది. అందుకు మొదటి ఉదాహరణ ప్రత్యేకహోదా. హోదా విషయంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి సాగినన్ని రోజులూ ఎలా మాట్లాడాడో అందరికీ తెలిసిందే. బీజేపీతో కలిసి ఉన్నంతసేపూ హోదా అవసరం లేదని చంద్రబాబు చెబుతూ వచ్చాడు. హోదా ఇవ్వమని అప్పట్లో బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించగా.. చంద్రబాబు దాన్ని సమర్థించాడు. హోదాకు మించిన ప్యాకేజీ వస్తుందని, హోదా వద్దని వాదించాడు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతర పెట్టినా చంద్రబాబు వినలేదు.

హోదా సంజీవని కాదని బాబు అన్నాడు. హోదా ఉద్యమంలో ఎవరూ పాల్గొనవద్దని చంద్రబాబు పిలుపునిచ్చాడు. హోదా అని ఎవరైనా అంటే వారికి జైలే అని చంద్రబాబు హెచ్చరించాడు.ఈ విధంగా హోదా వద్దని స్పష్టం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా కోసం తనే పోరాడుతున్నా అని అంటున్నాడు.

తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారం కూడా ఇదేవిధంగా కొనసాగిస్తున్నాడు బాబు. సుమారు మూడున్నర సంవత్సరాల క్రితమే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పలేమని కేంద్రం ప్రకటించింది. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మీద స్పందించలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పోరాడలేదు. కేంద్రంలో కలిసి ఉన్నాడు. ఇప్పుడు బీజేపీతో తెంచుకున్నాకా.. ఈ అంశంపై టీడీపీ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. బీజేపీ మోసం చేస్తోందని చంద్రబాబు వాదిస్తున్నాడు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని బాబు మర్చిపోతే ఎలా ..?