ఈ వ్యవహారాలు పవన్ ని ఇబ్బంది పెట్టేస్తున్నాయా ..?   Chalamalasetty Sunil Conditions Pawan Kalyan     2018-10-21   15:22:01  IST  Sai M

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియడంలేదు. ఏ నాయకుడు ఏ క్షణంలో ఎలా మారుతాడో ఏ పార్టీలోకి వేళ్తాడో ఎవరికీ అంతుపట్టడంలేదు. ఎన్నికల హడావుడి మొదలయిపోవడంతో ఒక మోస్తరు పేరున్న నాయకులందరికీ డిమాండ్ పెరిగిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు బలమైన నాయకులకు గేలం వేసే పనిలో ఉన్నాయి. నియోజకవర్గాన్ని శాసించగల నాయకుడు ఉంటే.. ఎన్నికల్లో గెలుపు ఖాయమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. పార్టీలు చెప్పినట్టు నాయకులు కాకుండా నాయకులు చెప్పినట్టు పార్టీలు వినే పరిస్థితి వచ్చేసింది.

ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా రెపరెపలాడించడంతో పాటు … కుదిరితే … సీఎం సీటును కూడా అందుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నిన్న మొన్నటి వరకు సీరియస్‌గా తీసుకోని రాజకీయాలను కూడా ఇప్పుడు మాత్రం సీరియస్‌గా భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ప్రజల్లో మంచి పలుకుబడి గల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారికి టికెట్లు కూడా కన్ఫర్మ్ చేయాలని చూస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే కొందరు షరతులు విధిస్తున్నారు. అయితే ఆ షరతుల విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నేను మీ పార్టీలోకి వస్తాను.. కాకపోతే నేను అడిగిన సీటుతో పాటు మరో సీటు కూడా కావాల్సిందే అంటూ షరతు పెడుతున్నారట. ఈ షరతులు మీకు ఇష్టం అయితే ఒకే లేకపోతే లేదు అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారట. దీనికి కారణం మరో పార్టీ నుంచి వారికి కూడా ఆఫర్లు రావడమే కారణం అని తెలుస్తోంది.

ఈ విధంగానే వైసీపీ మాజీ నేత, తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలను ప్రభావితం చేయగల నేత చెలమల శెట్టి సునీల్ ఇప్పుడు ఇదే వ్యవహారం నడిపిస్తున్నారు. జగన్‌తో విభేదించి బయటకు వచ్చిన సునీల్‌.. తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈయనను ఆహ్వానించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. అయితే, ఇటీవలే జనసేన నుంచి కూడా పిలుపు రావడంతో సునీల్ సందిగ్దంలో పడిపోయారు. తనకు కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతోపాటు.. తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని సునీల్‌ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. సునీల్‌ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.