అప్పుడే మొదలెట్టేసారు ! కాంగ్రెస్ లో మొదలయిన కుర్చిలాట !       2018-06-23   21:27:11  IST  Bhanu C

ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని వెనకటి సామెతను గుర్తు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇంకా ఎన్నికలే జరగలేదు.. పార్టీ అధికారంలోకి రాలేదు అప్పుడే సీఎం పీఠం నాది అంటే నాది అని ఒకరికొకరు కుమ్ములాడుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ దూకుడుగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలి అనే అంశం మీద తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అందుకు భిన్నంగా నాయకుల వ్యవహారం ఉంది.

ముఖ్యంగా తెంగన కాంగ్రెస్ లో త్రిముక పోరు కనిపిస్తోంది. ఒకరు కాంగ్రెస్‌‌లో సీనియర్ నేత మరొకరు పార్టీలో పదవిలో ఉన్న అగ్రనేత ఇంకొకరు కాంగ్రెస్‌లోకి కొత్తగా చేరిన లీడర్‌. కాంగ్రెస్‌ పార్టీలో ముగ్గురు నేతలు హాట్‌ టాపిక్‌గా మారారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి పదవిపై ఎవరికి వారుగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యం కంటే పదవుల కోసం పాకులాడటమే నేతల్లో ఎక్కువగా ఉంది.

ముగ్గురు నేతల వ్యవహారశైలిని కింది స్థాయి నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాలను పరిష్కరించాల్సిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పదవిని కాపాడుకోవడానికే సమయం కేటాయిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అంటూ… అనుచరులతో ప్రచారం చేయించుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. అలాగే సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డి నాలుగేళ్లుగా ఏనాడు పెదవి విప్పలేదు. అసెంబ్లీ లోపల, బయట సర్కార్‌ను విమర్శించిన దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదు. సీఎం పదవికి తనను మించిన అర్హత ఎవరికి లేదంటూ కొత్త చర్చకు తెరలేపారు.

ఇక కొత్తగా కాంగ్రెస్ లో చేరిన రేవంత్‌రెడ్డి పార్టీలో చేరే ముందు కొన్ని హామీలు ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. నామమాత్రమైన పదవి ఇస్తే సైలెంట్‌గా ఉండిపోనని హైకమాండ్‌కు లేఖ రాస్తానంటూ రేవంత్‌రెడ్డి ప్రకంపనలు రేపారు. రేవంత్‌ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ లో నెలకొన్నఈ కుమ్ములాటలు టిఆర్ఎస్ కు బాగా కలిసోస్తున్నయనే చెప్పవచ్చు.