వైసీపీలో కులాల గోల‌.... జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్సే..!       2018-04-17   22:58:11  IST  Bhanu C

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాడు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంతో వైసీపీకి ఒక్క‌సారిగా ఊపు వ‌చ్చింది. మ‌రో వైపు జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త‌న వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మంచి ఊపు వ‌చ్చింది. అయితే ఇదే టైంలో వైసీపీలో కులాల జ్వాల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. చివ‌ర‌కు పార్టీలో ఉన్న కులాల నాయ‌కులు జ‌గ‌న్‌కు అల్టిమేటం జారీ చేయ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుందా ? అనే సందేహాలు కూడా క‌లుగుతున్నాయి.

వైసీపీపై ఇప్ప‌టికే రెడ్డి కులం ముద్ర బాగా ప‌డిపోయింది. పార్టీలో కీల‌క ప‌ద‌వులు అన్ని జ‌గ‌న్ త‌న సొంత సామాజిక‌వ‌ర్గం అయిన రెడ్డి కుల‌స్తుల‌కే క‌ట్ట‌బెడుతున్నార‌ని మిగిలిన కులాల్లో అసంతృప్తి చెల‌రేగింది. అంత‌కు ముందు పార్టీకి వ‌చ్చిన ఏకైక రాజ్య‌స‌భ సీటును రెడ్డి వ‌ర్గానికే చెందిన విజ‌య‌సాయిరెడ్డికి ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ద‌క్కిన రాజ్య‌స‌భ సీటుపై బీసీల‌తో పాటు కాపు వ‌ర్గానికి చెందిన పార్టీ నేత‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

అంత‌కు ముందు రాజ్య‌స‌భ సీటు విజ‌య‌సాయిరెడ్డికి ఇవ్వ‌డంతో జ‌గ‌న్ ఖ‌చ్చితంగా ఈ సీటు బీసీల్లో లేదా కాపు ఉద్య‌మ నేప‌థ్యంలో ఆ వ‌ర్గానికే ఇస్తారని అంద‌రూ అనుకున్నారు. అయితే జ‌గ‌న్ రెండో రాజ్య‌స‌భ సీటునే రెడ్డి వ‌ర్గానికి చెందిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఇచ్చారు. వేమిరెడ్డి అదే నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావ‌డం మ‌రో విచిత్రం. దీంతో కాపుల్లో ఒక్క‌సారిగా పెద్ద అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపుల‌కు బాగా ప్ర‌యారిటీ ఇచ్చారు.

ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని నెత్తిన పెట్టుకోవ‌డంతో కాపుల‌కు బాగా కోత పెట్టేశారు. ఇదో దెబ్బ అనుకుంటే ఇప్పుడు గోదావ‌రి జిల్లాల్లో బ‌లంగా ఉన్న శెట్టిబ‌లిజ వ‌ర్గం నాయ‌కులు అయితే తాము వైసీపీకి దూర‌మ‌వుతున్నట్టు చేసిన ప్ర‌క‌ట‌న పార్టీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. వైసీపీలో ఈ వ‌ర్గం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ తిరుగులేని నాయ‌కుడిగా ఉన్నారు. ఈ శెట్టిబ‌లిజ వ‌ర్గంలో బోస్‌కు మంచి ప‌ట్టు ఉంది.

ఇప్పుడు బోసే స్వ‌యంగా పార్టీలో తిరుగుబావుటా ఎగ‌ర‌వేశారు. ఇందుకు జ‌గ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లాలో ఈ క‌మ్యూనిటీని ప‌క్క‌న పెట్ట‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో మూడు సీట్లు (కాకినాడ రూర‌ల్‌, రామ‌చంద్రాపురం, ముమ్మిడివ‌రం ) సీట్లు వీళ్ల‌కు ఇచ్చారు. ఇప్పుడు కేవ‌లం రామ‌చంద్రాపురం ఒక్క‌టి మాత్ర‌మే ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బోస్ ఆధ్వ‌ర్యంలో ఈ వ‌ర్గం జ‌గ‌న్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ఇప్ప‌టికే పార్టీపై రెడ్డి వ‌ర్గం ముద్ర‌ప‌డిపోయింది. ఇప్పుడు కాపులు, బీసీల్లో పార్టీపై వ్య‌తిరేక‌త పెరిగితే అది జ‌గ‌న్‌కు మామూలు దెబ్బ‌కాదు.