వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల రైతు సంఘాలు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ నిరసన మార్చ్ కొనసాగుతోంది.ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన బుధవారం ఏడవ రోజుకు చేరింది.
కేంద్రం విజ్ఞప్తికి సైతం చలించకుండా రైతులు తమ డిమాండ్లు వినేంతవరకూ ఆందోళన కొనసాగించేందుకు పట్టుదలగా ఉన్నారు.మంగళవారం కేంద్ర మంత్రుల బృందం రైతు నేతలతో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి.
మరోవైపు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు రైతులకు మద్ధతు పలుకుతున్నారు.నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమకు వచ్చిన అవార్డులు,మెడల్స్ అన్నింటినీ తిరిగిచ్చేస్తామని క్రీడాకారులు, కోచ్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
వీరిలో రెజ్లర్ మరియు పద్మశ్రీ అవార్డీ కర్తార్ సింగ్, అర్జున అవార్డ్ గ్రహీత హాకీ ఆటగాడు గుర్మైల్ సింగ్, ఒలంపిక్ హాకీ ఆటగాడు, అర్జున అవార్డ్ గ్రహీత సజ్జన్ చీమా, మాజీ ఇండియన్ హాకీ కెప్టెన్ రజ్బిట్ కౌర్ తదితరులు వున్నారు.
తాజాగా రైతుల ఆందోళనకు అంతర్జాతీయ స్థాయిలో మద్ధతు లభించింది.
అది కూడా సాధారణ వ్యక్తి నుంచి కాదు.ఓ దేశ ప్రధాని నుంచి.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఢిల్లీలో రైతుల నిరసనకు మద్ధతు పలికారు.శాంతియుతంగా నిరసనలు తెలిపేవారికి తమ దేశం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సిక్కుల ఆరాధ్య దైవం గురు నానక్ 551వ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా ఆయన కెనడాలోని సిక్కులతో మాట్లాడారు.ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబీలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రైతుల ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి తాను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నానని ట్రూడో పేర్కొన్నారు.నిరసన కార్యక్రమాలను చేస్తున్న రైతుల కుటుంబాల గురించి ఆందోళనగా ఉందని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను రైతులు తమ హక్కులను కాపాడుకుంటూనే ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన సూచించారు.అటు ప్రభుత్వం కూడా రైతుల హక్కుల గురించి ఆలోచించాలని.రైతులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ట్రూడో కోరారు.
విస్తీర్ణం విషయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన కెనెడాలో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ముఖ్యంగా ఇక్కడ సిక్కుల జనాభా ఎక్కువ. జస్టిన్ ట్రూడో తన మొదటి పదవీకాలంలో క్యాబినెట్ ఏర్పాటు చేసినపుడు నలుగురు సిక్కులకు చోటివ్వడాన్ని గమనిస్తే, ఆ దేశంలో సిక్కులకు ఉన్న ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది.
సిక్కులపట్ల ఆయనకు ఉన్న ఉదారత వల్లే కెనడా ప్రధానిని సరదాగా జస్టిస్ ‘సింగ్’ ట్రుడో అంటుంటారు.కెనడాలో పెద్ద సంఖ్యలో ఉన్న పంజాబీలను మెప్పించడానికే ట్రూడో భారత్లో రైతుల ఆందోళనలకు మద్ధతుగా నిలిచారు.
పైగా ఇప్పుడు నిరసన చేస్తున్న వారిలో ఎక్కువమంది పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే కావడం గమనార్హం.