జనాల్లో పరపతి పెంచుకునేందుకు రాజకీయ నాయకులు తమ వీలునుబట్టి యాత్రలు చేపట్టేందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. బస్సుయాత్ర, బైక్ యాత్ర, పాదయాత్ర ఇలా అవకాశం ను బట్టి యాత్రలు చేపట్టి ప్రజల్లో పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఇదే బాట పట్టారు.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం, భారీగా జనాలు ఈ సభకు హాజరు కావడం తదితర అంశాలతో బండి సంజయ్ పేరు మారుమోగింది.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫోన్ చేసి మరి సంజయ్ ను ప్రశంసించారు.
తాజాగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టనున్నట్లు నిన్న జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేపట్టేందుకు ప్లాన్ చేసుకున్నారు.
మూడో విడత పాదయాత్ర మొత్తం ఇరవై రోజుల పాటు కొనసాగనుంది.అలాగే నాలుగో విడత పాదయాత్ర ఆగస్టులోపు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు .ఈ మేరకు బిజెపి తెలంగాణ కార్యాలయం లో నిన్న జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ యాత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ముగుస్తుంది తదితర విషయాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్లు ప్రకటించారు.మూడో విడత ప్రజా సంకల్పయాత్ర ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ చేయాలని తెలంగాణ బిజెపి నాయకులు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు పటిష్టమైన ప్రణాళికతో యాత్ర చేపట్టేందుకు సంజయ్ సిద్ధం అవుతున్నారు.
ఈ మూడో విడత యాత్రలో బీజేపీ పరపతి పెంచడం తో పాటు టీఆర్ ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్లి బీజేపీ పై జనాల్లో ఆదరణ పెరిగే విధంగా చేయాలనే లక్ష్యంతో సంజయ్ ఉన్నారు.