తెలంగాణ అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ( BRS party )ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది.తెలంగాణ ఏర్పడిన తరువాత వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించింది.
మూడోసారి హ్యాట్రిక్ ఖాయమని అంచనా వేసినా, ప్రజలు బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలికి, కాంగ్రెస్ కు పట్టం కట్టారు.బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పార్టీలో, ప్రభుత్వంలో అనేక పదవులు పొంది కీలకంగా వ్యవహరించిన నాయకులంతా ఇప్పుడు వరుసగా పార్టీకి గుడ్ బాయ్ చెబుతూ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బీ ఆర్ ఎస్ కు మింగుడు పడడం లేదు.
ప్రస్తుతం బీ ఆర్ ఎస్ లో వలసలు ఊపందుకున్నాయి.పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పదవులు అనుభవించిన వారు, కెసిఆర్( KCR ) అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినవారు సైతం పార్టీ మారిపోతున్నారు.
పార్టీ ఇంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరు ఊహించలేకపోయారు.ఇప్పటికే ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్( Congress ) చేరిపోయారు.ఈ జాబితా ఇంకా పెరిగేలాగే కనిపిస్తోంది.
అయితే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు , ఇతర కీలక నాయకులంతా గతంలో టిడిపి నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారే కావడం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )సైతం గతంలో టిడిపి నుంచి వచ్చిన వారే కావడం , అప్పటి పరిచయాలతో సులువుగా పార్టీ మారిపోతున్నారు.ఎక్కువమంది టీడీపీ నుంచి వచ్చిన వారే కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.
ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట ఉన్నవారు మాత్రమే పార్టీని అంటిపెట్టుకుని ఉండే పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ లో నెలకొంది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు, కడియం శ్రీహరి , పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు టిడిపి నుంచి వచ్చిన వారే.ఇంకా దాదాపు 20 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ అగ్ర నాయకులతో టచ్ లో ఉన్నారని, ఏ క్షణమైన వారు పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు బీఆర్ఎస్ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి.గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ను ఏ విధంగా బలహీనం చేసి , ఆ పార్టీ ఉనికిలో లేకుండా చేసేందుకు కేసిఆర్ ప్రయత్నించారో ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.