పెళ్లి పందిట్లో షాకింగ్ సంఘటన..! అరుంధతి నక్షత్రం చూస్తూనే.. అనంతలోకాలకు.!       2018-07-07   22:15:32  IST  Raghu V

కళ్యాణ మంటపం.. విషాదంగా మారింది. నవ్వుతూ, కేరింతలు కొడుతూ, ధాంధాం చేస్తున్న బంధువులు, స్నేహితులు షాక్ లోకి వెళ్లారు.. ఊహకే అందని.. కలలో కూడా ఊహించలేని విషాదం ఆ కల్యాణ మంటపంలో జరిగింది. అప్పటిదాకా సందడిగా సాగుతున్న పెళ్లి వేడుకలో వధువు మృతితో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వరుడితో తాళి కట్టించుకొని అరుంధతి నక్షత్రాన్ని చూడటానికి సిద్ధమవుతుండగా ఆ అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన నాగర్కర్నూల్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

జూలై 7వ తేదీ శనివారం ఉదయం వెంకటేష్, లక్ష్మి లకు పెళ్లి. బంధువులు, స్నేహితులు, కాలనీవాసులతో అంతా హడావిడిగా ఉంది. డాన్సులు, ఆటపాటలతో హంగామా కూడా ఉంది. వధువు మెడలో తాళి కట్టాడు వరుడు, తలంబ్రాలు పోశాడు. ఏడు అడుగులు కూడా వేశాడు.. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆకాశంలో అరుంధతీ నక్షత్రం చూపించాడు పంతులు గారు.

ఈలోగా వధువు బుజ్జి పెళ్లి పీటలపై కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. తమ కూతురుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నవ వధువు మృతితో ఆమె తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.