రామ్‌ చరణ్‌పై బోయపాటి అసంతృప్తి!   Boyapati Srinu Not Happy With Hero Ram Charan     2018-10-28   09:11:21  IST  Ramesh P

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గత వేసవిలో ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం తర్వాత చరణ్‌ చేస్తున్న చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన బోయపాటి శ్రీను ప్రస్తుతం చరణ్‌తో ఒక హై ఓల్టేజ్‌ కథాంశంతో మాస్‌ మసాలా సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రాన్ని మొదట దసరాకు విడుదల చేయాలని బోయపాటి ప్రయత్నాలు చేశాడు.

‘రంగస్థలం’ చిత్రీకరణలో ఉండగానే బోయపాటి చిత్రీకరణ మొదలు పెట్టాడు. చరణ్‌ లేకుండానే ఒక షెడ్యూల్‌ ను పూర్తి చేసిన బోయపాటి ఖచ్చితంగా దసరాకు తీసుకు రావాలని భావించాడు. కాని చరణ్‌ ఆలస్యం కారణంగా సినిమాను దసరా నుండి సంక్రాంతికి వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతికి అయినా సినిమా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రం షూటింగ్‌ అనుకున్నట్లుగా జరగడం లేదట. వరుసగా ఏదో ఒక కారణం చెబుతూ రామ్‌ చరణ్‌ షూటింగ్‌కు డుమ్మా కొడుతున్నట్లుగా బోయపాటి ఆగ్రహంతో ఉన్నాడు.

Boyapati Srinu Not Happy With Hero Ram Charan-

చరణ్‌ స్టార్‌ హీరో కనుక బోయపాటి బయటకు ఏం మాట్లాడలేక పోతున్నాడట. కాని సన్నిహితుల వద్ద మాత్రం చరణ్‌ విషయంలో బోయపాటి చాలా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌ గత కొన్ని రోజులుగా మెల్లగా సాగుతుందని, చివరికి వచ్చేప్పటికి హడావుడి చేస్తాడేమో అంటూ బోయపాటి ఆందోళనతో ఉన్నాడు. చరణ్‌ గత చిత్రాలు ధృవ మరియు రంగస్థలం చిత్రాలు కూడా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విడుదల అయ్యాయి. అలాగే ఇప్పుడు బోయపాటి మూవీ కూడా ఆలస్యం అవుతుందేమో. దీపావళికి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏం చేసైనా సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చరణ్‌ కూడా సంక్రాంతికి సినిమా విడుదలైతే జక్కన్న మూవీకి డేట్లు ఇవ్వాల్సి ఉంది. అందుకే చివరి నిమిషంలో హడావుడిగా సినిమాను పూర్తి చేస్తారేమో చూడాలి.