కుటుంబ సమేతంగా....     2015-06-07   01:52:20  IST  Bhanu C

సకుటుంబ సపరివార సమేతంగా అనుకున్న రోజున, అనుకున్న మహూర్తానికి పని పూర్తి చేశారు ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ. ఏమిటీ పని? కాంగ్రెసుకు గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనతో పాటు భార్య, తమ్ముడు కూడా చేరారు. భార్య ఝాన్సీ కాంగ్రెసు తరపున ఎంపీగా పనిచేశారు. తమ్ముడు కూడా కాంగ్రెసు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు హోల్‌ ఫ్యామిలీ వైకాపాలో చేరిపోయింది. ఈ ఫ్యామిలీ ప్యాకేజీ ఏమిటనేది తెలియదు. బొత్స కుటుంబంతో పాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్‌, మరి కొందరు నాయకులు కూడా వైకాపాలో చేరారు. వీరంతా ఉదయం ఏడున్నరకల్లా హైదరాబాదులోని లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు. అనుకున్న ముహూర్తానికి అంటే ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు వైకాపా కండువాలు కప్పుకున్నారు. ఇద్దరు శుత్రువులు మిత్రులయ్యారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అందుకు ఇది తాజా ఉదాహరణ. ఈ స్నేహం ఎన్నాళ్లు ఉంటుందనేది చెప్పలేం. జగన్‌కు ఎంత గీర ఉందో బొత్సకు అంతకంటే ఎక్కువ ఉంది. జగన్‌ చెప్పినదానికంతా బొత్స తల ఊపుతాడని చెప్పలేం. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఫ్రెండ్‌షిప్‌ ఉంటుందా? అని ఎక్కువమంది అనుమానిస్తున్నారు.