టీడీపీకి గుదిబండగా మారిన ఎమ్యెల్యే బొండా ఉమ !       2018-05-30   23:42:07  IST  Bhanu C

శత్రువులు ఎక్కడో ఉండర్రా .. మన చుట్టూనే.. మన అక్కగానో .. చెల్లిగానో , కూతురిగానో కొడుకుగానో ఉంటార్రా.. అంటూ ఓ సినిమాలో బాగా పాపులర్ అయినా డైలాగ్ ఉంది. సరిగ్గా అలాంటి డైలాగ్ ఇప్పడు తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. పై స్థాయిలో చంద్రబాబు ఎంత కష్టపడినా … కింది స్థాయిలో ఎమ్యెల్యేలు దాన్ని నీరుగార్చేస్తున్నారు.
ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత టీడీపీ కొంప ముంచేటట్లే ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వరుస ఆరోపణలు వస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాపై భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందిగా మారింది. రాజధానికి దగ్గరగా ఆయన నియోజకవర్గం ఉండడంతో ప్రభుత్వం పరువు బజారున పడుతోంది.

బొండా ఉమ పై ఆరోపణలు కొత్తేమి కాదు. తరుచూ ఆయన వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు ఒక స్వాతంత్ర సమరయోధుడి భూమిని కబ్జా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలో వచ్చాయి. అనంతరం ఇద్దరు మహిళలకు చెందిన 86 సెంట్ల భూమిని కాజేసేందుకు ప్రయత్నించారని బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. కేవలం బొండా ఉమనే కాదు, ఆయన భార్యపై కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా, మరో భూవివాదంలో బొండా పేరు వినిపిస్తోంది.

విజయవాడలోని సుబ్బరాయనగర్ లో స్థలం అమ్ముతామని చెప్పి బోండా అనుచరులు మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు నందిగామకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి వద్ద నుంచి రూ.35 లక్షలు తీసుకున్నారు. ఇక స్థలం రిజిస్ట్రేషన్ చేయించాలని లేదా డబ్బులైనా తిరిగి ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రమణ్యం ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన బోండా ఉమతో పాటు అనుచరులపై నగర పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బోండా ఉమకు గతంలోనే గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అయినా ఉమపై ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న బోండా ఉమపై చర్యలు తీసుకోకుండా టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇవ్వడం సరికాదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే బొండా కాపు సామజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఆయన మీద ఏదైనా చర్య తీసుకుంటే ఆ ప్రభావం గట్టిగా పార్టీపై పడుతుందని బాబు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడు.