యుగాలు మారాయి.తరాలు మారాయి.
కానీ మనుషులు మాత్రం మూఢ నమ్మకాల ఊబిలోనే కూరుకుపోయారు.కంప్యూటర్ యుగంలోనూ చేతబడి, క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలను నమ్ముతున్నారు.
ఓ వైపు మూఢ నమ్మకాలతో కొందరు దాడులకు తెగబడుతున్నారు.మరోవైపు చేతబడులు, క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానాలతో అమాయక ప్రజలను సైతం పొట్టన పెట్టుకుంటున్నారు.
తాజాగా మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు.ఈ అమానుష ఘటన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం జలగలవంచ గొత్తికోయ గుంపులో చోటు చేసుకుంది.
మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో మడకం అనిల్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హతమార్చారు.అనిల్‌ను అనుమానించిన పురకసం బద్రీ, మడకం మంగయ్యలు అతనిపై దాడి చేశారు.
అనిల్‌ను గొడ్డలితో నరికి, ఆపై కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
నిందితులైన బద్రీ, మంగయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.