గ్రేటర్ లో విజయం కోసం తహతహలాడుతున్న బీజేపీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మాటల తూటాలను రాజకీయ ప్రత్యర్థులపై వదులుతోంది.అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా, బీజేపీ చేస్తున్న రాజకీయం కాస్త విమర్శల పాలు అవుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో నోరు జారుతూ, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి మరింత గా చేటు తీసుకు వస్తున్నాయి.దీంతో బీజేపీ కి సానుకూలంగా ఉన్న చోట, తటస్తుల వైఖరిలో మార్పు వస్తున్నట్లుగా కనిపిస్తుండడంతో, బీజేపీ సైతం కాస్త ఆందోళన చెందుతున్నట్లు గా కనిపిస్తోంది.
మూడు రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో , వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని, పావురాల గుట్ట లో జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేస్తూ, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వైసిపి కార్యకర్తల తో పాటు , వైయస్సార్ అభిమానుల మనసులను గాయపరిచారు.
ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవాలని చూసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.తెలంగాణలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం కారణంగా, ఎక్కడ తమ ఓటు బ్యాంకు కు చిల్లు పడుతుందో అనే టెన్షన్ బీజేపీలో మొదలైంది వెంటనే రఘునందన్ రావు ఈ వ్యవహారంపై చింతిస్తూ, క్షమాపణలు చెప్పినా వైఎస్సార్ అభిమానుల ఆవేశం మాత్రం చల్లారలేదు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, పాత బస్తీ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో బీజేపీ మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎదురుదాడికి దిగడం, ప్రజల్లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరగడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.పాతబస్తీలో పాకిస్తానీయులు ,రోహింగ్యాలు ఉన్నారని వారంతా ఓట్లు వేసి ఎంఐఎం ను గెలుస్తున్నారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం ఈ వివాదానికి కారణం అయ్యింది.సున్నితమైన అంశాలలో ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి బీజేపీ తమకు తామే ఇబ్బందులు సృష్టిస్తోంది.
ఇప్పటికే బండి సంజయ్ పెద్ద ఎత్తున హామీలను గుప్పిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ గెలిస్తే వరద కారణంగా ఇబ్బందిపడిన ప్రజల కష్టాలు తీరుస్తామని , బండి కి బండి, ఫర్నిచర్ కి ఫర్నిచర్, 25 వేల నగదు కూడా అందిస్తామంటూ హామీలు ఇస్తున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో గెలవాలని ఉద్దేశంతో బీజేపీ నాయకులు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో అనేది మరిచిపోయి మరి వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.