ప్రతి వారం ప్రశ్నిస్తారట ... సమాధానం చెప్పు బాబు       2018-07-05   00:31:01  IST  Bhanu C

టీడీపీని ఇరుకునపెట్టడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నేతలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఏ వంక దొరుకుతుందా బాబు రాజకీయాలను అడ్డుకుందామా అని కాసుకుని కూర్చుంది. కేంద్రం తమకు సహకరించకపోయినా బాబు మాత్రం ఎక్కడా ఆలోటు కనిపించకుండా ప్రజల్లో పరపతి పెంచుకునేందుకు ఏపీలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో సానుభూతి సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇదే సమయంలో బీజేపీ ఆ పథకాల్లో లోపాలను వెతికి పట్టుకుని బాబు ని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది.

దీనిలో భాగంగానే.. బాబు పరిపాలనపై ఇప్పటివరకు వచ్చిన వైఫల్యాలు, అవినీతి మీద ప్రతి వారం ఐదు ప్రశ్నలతో బహిరంగ లేఖలు రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించారు. దీనికి సంబంధించి అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేశారట. ఇందులో భాగంగా మొట్టమొదట ఐదు ప్రశ్నలను సంధిస్తూ సీఎంకు రాసిన లేఖను కన్నా విడుదల చేశారు. అయితే ఆ ప్రశ్నలకు టీడీపీ స్పందిస్తుందో లేదో తెలియదు కానీ కాన్సెప్ట్ అయితే మాత్రం కొత్తగా ఉంది.

2014 ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలి. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే అలా చేశారా ?

అధికారంలోకి వచ్చిన తొలిరోజు సంతకాలు చేసిన రైతు – డ్వాక్రా రుణమాఫీ – బెల్టుషాపుల మూత – ప్రతి ఇంటికీ శుభ్రమైన తాగునీరు పంపిణీ హామీల అమలు తీరేమిటి ? వీటిని అమలు చేయలేదనే విషయాన్ని మీ ధర్మపోరాట దీక్షలో ప్రజలకు వివరించి – వారికి క్షమాపణ చెప్పే ధైర్యం మీకు ఉందా?

ఓటుకు కోట్లు వ్యవహారంలో నిజాలను ప్రజలకు వివరించి మీరూ మీ పార్టీ ఏ నేరానికి పాల్పడలేదని ఒక బహిరంగ ప్రకటన చేయగలరా? ఫోను సంభాషణలో బయటపడ్డ ‘బ్రీఫ్డ్ మీ’ అన్న మాటలు మీవి కాదని ప్రజలకు చెప్పగలరా?

గ్రామ పంచాయతీ – మండల ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన నేతలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి.. ప్రతి పథకం వారి ద్వారా అమలు చేయిస్తూ కమీషన్లు – లంచాలు చెల్లిస్తే గానీ సంక్షేమ కార్యక్రమాలు అందని పరిస్థితి కల్పించింది నిజం కాదా?

విశాఖ భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వాటన్నింటిపై వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేసే ధైర్యం ఉందా? అని సీఎం కు రాసిన లేఖలో నిలదీశారు.