ఏపీపై బీజేపీ ఆప‌రేష‌న్‌.. స్టోరీ ఏంటి..?     2018-05-13   22:30:09  IST  Bhanu C

అవును! ఏపీ రాజ‌కీయాల్లో ఇదే విష‌యంపై ఇప్పుడు పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ప‌గ‌బ‌ట్టిందా? ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు పాల‌న‌పై ఉక్కుపాదం మోపేందుకు, ఆయ‌న హ‌వాను త‌గ్గించేందుకు ఏదైనా చేయ‌నుందా? ఒక‌వేళ చేస్తే.. ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే అనేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. దీనికి ప్ర‌ధానంగా ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు చేసిన వ్యాఖ్య‌లే! ఆయ‌న ఇటీవ‌ల కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో రాజ‌కీయాలు కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా మారిపోనున్నాయ‌ని చెప్పారు. అది కూడా క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాక‌.. ఈ మార్పులు త‌థ్య‌మ‌ని చెప్పారు.

ఆయ‌న ఉండ‌బ‌ట్ట‌లేక చెప్పారో? వాస్త‌వ‌మే చెప్పారో తెలియ‌దు కానీ.. ఆయ‌న ఈ కామెంట్లు చేయ‌డంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాలు వేడెక్కాయి. సాక్షాత్తూ.. సీఎం చంద్ర‌బాబే ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. `ఏపీ రాజ‌కీయాలను శాసిస్తార‌ట‌`- అంటూ విరుచుకుప‌డ్డారు. ఇక‌, జీవీఎల్ వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీ రాజ‌కీయాలు మార‌తాయ‌ని అన్నారు. అయితే, అవి ఎలా మార‌తాయో ఆయ‌న చెప్ప‌లేదు. అంతేకాదు, ఈ మార్పుల‌కు అనుగుణంగా అన్ని పార్టీలూ సిద్ధంగా ఉండాలన్నారు. గత కొద్ది నెలలుగా ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రచారం చేసుకుంటోందని… దానిని తిప్పి కొట్టి, ప్రజా కోర్టులో నిలబెడతామని హెచ్చరించారు.