బీజేపీని గెలిపించిన బాబు అతి తెలివి       2018-05-16   02:39:13  IST  Bhanu C

కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలు చేజిక్కించుకోవడం వెనుక చంద్రబాబు ఉన్నట్టు ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. అదేంటి చంద్రబాబు కు బీజేపీకి దోస్తీ చెడింది కదా .? ఆయన ఆ పార్టీ ఓడిపోవాలని చూస్తాడు కానీ బీజేపీ విజయానికి కారణం ఎందుకు అవుతాడు ..? అనే కదా మీ సందేహం ..? ఆగండాగండి ఆ సందేహానికి సమాధానమే ఇందులో ఉంది.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని చిత్తూ చిత్తుగా ఓడించడం వల్ల దేశం లో మోదీ హవా లేదు అని నిరూపించాలని చంద్రబాబు అండ్ కో బృందం ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుకూలంగా కొంతమంది బాబు మనుషులు నెట్ వర్క్ నడిపారు. కర్నాటకలో ఉన్న తెలుగువారంతా చంద్రబాబు మనుషులే వారంతా ఆయన ఎలా చెబితే అలా చేస్తారన్న ధీమాతో ప్రచారం చేశారు. ఆఖరికి ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా కర్ణాటకలో రాజకీయం చేసి వచ్చాడు.

ఎన్నికలు అయిపోయాయి .. ఫలితాలు వచ్చేసాయి ..ఆ ఫలితాలను చూసిన తర్వాత టీడీపీ వల్లే కాంగ్రెస్‌కు నష్టం జరిగిందా అన్న అభిప్రాయం అందరిలో తలెత్తింది. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ బీజేపీనే పైచేయి సాధించింది. వాస్తవానికి కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందనుకున్న స్థానాల్లో ఆ పార్టీ బోర్లాపడింది. బాబు బృందం తమ పరిధి దాటి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం వల్ల అది కాంగ్రెస్ కు నష్టం చేకూర్చింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ చేసిన ప్రచారం వల్ల అప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓటేస్తారనుకున్న వారిలోనూ మార్పు వచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందనుకున్న నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు కాంగ్రెస్ కు ఓట్లేయమని అక్కడి తెలుగువారిని కోరడంతో చంద్రబాబు అంటే గిట్టని చాలామంది తెలుగు వాళ్ళు ఆయన చెప్పారు కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేయలేదని తెలిసి అక్కడి కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

అనవసరంగా చంద్రబాబు బృందం మద్దతు తీసుకుని ఓటమి చవిచూశామని లబోదిబోమంటున్నారు. మోదీని దెబ్బకొట్టాలని బాబు చూస్తే అది కాంగ్రెస్ ను దెబ్బకొట్టినట్టు అయ్యింది. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తాపడ్డావులే బుల్లబుల్ పిట్టా అని కర్ణాటక బీజేపీ నాయకులు బాబు ని చూసి నవ్వుకుంటున్నారు.