తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించాలనే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.దీనిలో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలు హస్తిన బాట పట్టారు.
ఇప్పటికే రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.మరోవైపు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించింది.
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించారు.అదేవిధంగా ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టగా.
ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు కాషాయ తీర్థాన్ని పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తుంది.
ఢిల్లీకి చేరుకున్న టీబీజేపీ కీలక నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్ లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు.రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రాభివృద్ధితో పాటు బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం.